కావలి డీఎస్పీని సస్పెండ్‌ చేయాల్సిందే.. గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు!

బిజెపికి చెందిన బిసి నేతపై కర్కశంగా వ్యవహరించిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీని సస్పెండ్ చేయాల్సిందే అంటూ బిజెపి నేతలు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను డిమాండ్ చేశారు. ఆ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో మంగళవారం గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.
 
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయనకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకుడు మొగిరాల సురేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ.. సురేష్‌ను తన రెండు కాళ్లతో బంధించి నొక్కుతున్నట్లు ఉ న్న ఫొటో సోషల్ మీడియాల వైరల్‌ అయింది. తమ పార్టీ కార్యకర్తపై డీఎస్పీ కర్కశంగా వ్యవహరించారంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది.
 
ఇప్పటికే ఏపీ డీజీపీ, జాతీయ బీసీ కమిషన్‌, మానవ హక్కుల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర  గవర్నర్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. కావలి పోలీసుల తీరును గవర్నర్‌కు వివరించిన బీజేపీ నాయకులు వెంటనే డీఎస్పీని సస్పెండ్‌ చేయాలని కోరారు. ఈ మేరకు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు.
 
గవర్నర్‌ను కలిసిన అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. బీసీలంటే సీఎం జగన్‌కు ఎందుకంత చిన్న చూపు అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీజేపీ నేత సురేష్‌పై కావలి డీఎస్పీ దాడి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు ముందుగానే పోలీసుల అనుమతి కోరినా వారి నుంచి స్పందన లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు దర్మార్గంగా వ్యవహరించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కర్నూలులో వచ్చే నెల 16, 17 తేదీల్లో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించాలని సంకల్పించినట్లు వెల్లడించారు.