యాంటీ డ్రోన్ టెక్నాలజీతో తిరుమలలో నిఘా

తిరుమల పుణ్యక్షేత్రంలో త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తిరుమలలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రత్యేకమైన శిక్షణను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడే దళారీలపై ఉక్కుపాదం మోపనున్నారు.

తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(హోం) హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్‌ జరిగింది.  కరోనా అనంతరం తిరుమలకు యాత్రికులు పెరగడం, వాహనాల రద్దీ పెరగడంతో భద్రతను ఎలా పెంచాలనే విషయమై చర్చించడానికి టిటిడి భద్రతాధికారులు, పోలీసు శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించారు.  ‘నిత్యం 60 నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తారు. ఇక్కడ భద్రతాపరమైన చర్యలు పటిష్టం చేసేందుకు పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సరికొత్త సవాళ్లను ఎదుర్కోడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. అందుకే అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయబోతున్నాం’ అని హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

‘ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణల భద్రతా పరమైన అంశాలపై కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సభ్యులు 10 రోజులలోపు క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత నివేదికను ఇస్తారు. ఆ నివేదిక సిఫార్సులపై ముందుకెళ్తాం. అవసరమైన అధునాతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం’ అని తెలిపారు.

‘తిరుమల పరిపాలనలో దర్శన టికెట్ల దగ్గర నుంచి అద్దె గదుల వరకు.. ప్రతీ విభాగంలో భక్తుల ఆధార్ డేటాను అనుసంధానం చేస్తాం. సైబర్ దాడులు జరగకుండా భక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. అందుకు అత్యున్నత సైబర్ సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేయబోతున్నాం’ అని చెప్పారు.
తిరుమల మాడవీధుల్లో 24 గంటలూ యాక్సెస్ కంట్రోల్ ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారని, అవసరమైన సాయుధ దళాలను అందుబాటులో ఉంచుతామని, మూడంచెల భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామనిని హరీష్ కుమార్ గుప్తా వివరించారు.
 
సోషల్ మీడియాలో ఫేక్ వెబ్ సైట్లు తిరుమల క్షేత్రం గురించి చేస్తున్న విష ప్రచారాన్ని అరికట్టడానికి.. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది నిరంతరం నిఘా పెడుతూ ఫేక్ వెబ్ సైట్లను నిషేధించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
శ్రీవారి బూందీ పోటు, శ్రీవారి ఆలయం ప్రసాద తయారీ కేంద్రాల వద్ద జరిగే అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో  ఫైర్ అలారం సిస్టంను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో వాటిని ఎలా ఉపయోగించాలో అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణను ఇస్తామని హరీష్ కుమార్ గుప్తా చెప్పారు.