వసుధైక కుటుబమే భారత్ నినాదం

వసుదైక కుటుంబం అన్నదే భారత్ నినాదమని భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద వున్న భారత్ స్పందిస్తోందని, అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని పేర్కొన్నారు.  బ్రిస్బేన్‌లో త్వరలోనే భారత కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఆస్టేలియా పర్యటనలో ఉన్న ప్రధాని సిడ్నీలో మంగ‌ళ‌వారం నాడు ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వంద దేశాల‌కు పైగా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించి వందల కోట్ల ప్రజల ప్రాణాలను కాపాడమని గుర్తు చేశారు. ప్ర‌పంచం వసుదైక కుటుంబం అనే భావ‌న‌ను భార‌త్ విశ్వ‌సిస్తున్న‌ద‌ని, అందుకే స‌హాయ, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అవ‌స‌ర‌మైన దేశాల‌కు త‌క్ష‌ణం కొన‌సాగిస్తున్నామ‌ని పేర్కొన్నారు.
 
ఇక భారత్ ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని అవి కామన్‌వెల్త్,  క్రికెట్, కర్రీ అని ప్రధాని తెలిపారు. భారత్ – ఆస్ట్రేలియాను కలిపి వుంచే మరో బంధం యోగా అని చెప్పారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని ప్రధాని వివరించారు.  వలసల ఒప్పందం వల్ల ఇరుదేశాల విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరమని ప్రధాని తెలిపారు. 
తనతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని మోదీ పేర్కొంటూ ఇరు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  ఆస్ట్రేలియా వాసులు సహృదయులు, విశాల హృదయులని కొనియాడుతూ భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియాలో ప్రముఖంగా వినిపిస్తాయని మోదీ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలు భారతీయులకు ప్రత్యేకమైనవని చెబుతూ ప్రముఖ భారతీయ వంటకాలన్నీ ఆస్ట్రేలియాలో లభిస్తాయని ప్రధాని చెప్పారు.
ఆస్ట్రేలియా ప్రధానికి ఇక్కడి జైపూర్ జిలేబీలను రుచి చూపిస్తానని మోదీ తెలిపారు. సిడ్నీలో లక్నో పేరుతో ఓ ప్రత్యేక ప్రాంతం వుందని పేర్కొంటూ సిడ్నీ ఓపెరా హౌస్‌పై భారత జెండా కనిపించడం సంతోషంగా వుందని ప్రధాని చెప్పారు.  ఆస్ట్రేలియా తరహాలో భారత్ కూడా త్వరలోనే అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు.
 
మొబైల్ వినియోగం, ఫిన్ టెక్ రంగంలో, పాల ఉత్పత్తిలో భారత్ నెంబర్‌వన్‌గా వుందని, ఇంటర్‌నెట్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ది రెండో స్థానమని మోదీ వివరించారు. అనేక దేశాలు ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నాయని,  కానీ భారత ఆర్ధిక వ్యవస్థ మాత్రం స్థిరంగా వృద్ధి సాధిస్తోందని ప్రధాని తెలిపారు.
 
భారత అన్ని దేశాలకు ఆశాదీపమని ప్రపంచబ్యాంక్ చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని సీజేబీటి అందులో భాగంగానే సౌర విద్యుత్ తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తుందని వెల్లడించారు. భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం తన లక్ష్యం, కలగా చెప్పారు.