
బెంగళూరులో హఠాత్తుగా ఆదివారం కుండపోత వానతో నగరమంతా జలమయంగా మారింది. ఈ అనూహ్య వర్షంతో ఓ విషాదం జరిగింది. కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద ఓ కారు నీటిలో మునిగి ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడకు చెందిన భానురేఖ అనే యువతి మృతి చెందారు. ఆమె ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
కుటుంబంతో కలిసి ఆదివారం బెంగళూరు నగరంలో కారులో వెళుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. కారులోని మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులను స్థానికులు, సహాయక సిబ్బంది కాపాడారు. భారీ వర్షం కురవటంతో బెంగళూరులోని కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‍లోకి నీరు భారీగా వచ్చింది. నీటి లోతును అంచనా వేయలేకపోయిన డ్రైవర్ కారును అలాగే ముందుకు తీసుకెళ్లటంతో ఒక్కసారిగా కారు సగానికిపైగా మునిగిపోయింది. నీటిలో చిక్కుకు పోయింది. ఆ తర్వాత మరింత నీరు అక్కడికి చేరింది. కారులోని వారిని స్థానికుల సాయంతో సహాయక సిబ్బంది బయటికి తీసుకొచ్చారు.
దగ్గర్లోని సెయింట్ మార్తాస్ ఆసుపత్రికి తరలించారు. అయితే భానురేఖ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. చికిత్స పొందుతున్న ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
“ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడకు చెందిన ఓ కుటుంబం.. బెంగళూరు చూసేందుకు వచ్చారు. ఓ కారును తీసుకున్నారు. భారీ వర్షం కారణంగా.. అండర్‌పాస్ వద్ద ఉన్న బ్యారికేడ్లు కిందపడిపోయాయి. ఆ సమయంలో అండర్‌పాస్‍ను దాటేందుకు ఆ కారు డ్రైవర్ రిస్క్ తీసుకున్నారు. అతడు అలా చేయాల్సింది కాదు” అని రిపోర్టర్లతో సిద్ధరామయ్య చెప్పారు.
ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో భానురేఖ శ్వాస ఇంకా ఆడుతోందని, అయితే వైద్యం అందించేందుకు అక్కడి డాక్టర్లు నిరాకరించారని ఈ ఘటనను కవర్ చేసిన కొందరు రిపోర్టర్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపించి, తగిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కేఆర్ సర్కిల్ వద్ద నీటిలో ఓ ఆటోలోని ఓ మహిళ కూడా చిక్కుకున్నారు. అయితే ఆమె ఆటో టాప్ పైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. సహాయక సిబ్బంది ఆమెను కూడా బయటికి తీసుకొచ్చారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో బెంగళూరు సహా సలు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల వాహనాలు రోడ్డు పక్కనే పార్కింగ్ చేయగా.. భారీ వృక్షాలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. రేస్ కోర్స్ రోడ్డుపై ఓ లగ్జరీ కారు నుజ్జునుజ్జయింది. కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా కారు, బైక్ పై భారీ వృక్షం పడి వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
భారీ వర్షం, గాలుల కారణంగా బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. మెజిస్టిక్ సమీపంలోని ఇంకో అండర్ పాస్‍లో మరికొన్ని వాహనాలు చిక్కుకున్నాయి. ఆ వాహనాల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు నానా కష్టాలు పడ్డారు. బెంగళూరులో చాలా చోట్ల వండగండ్లు కూడా పడ్డాయి.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు