మోదీకి పపువా న్యూ గినియా ప్రధాని పాదాభివందనం

జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ  ఆదివారం రోజున పపువా న్యూ గినియాకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఘన స్వాగతం పలికారు.  ప్రధాని మోదీ విమానం దిగగానే పపూవా ప్రధాని జేమ్స్ మారాపే సంప్రదాయబద్ధంగా ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. దీంతో మోదీ ఆయనను పైకి లేపి భూజాన్ని తట్టి కౌగిలించుకున్నారు. పోర్టు మోర్స్‌బైలో ఆయనకు సైనిక గౌరవ వందనం దక్కింది.

అనంతరం మోదీకి ఇతర అధికారులకు ఆయన పరిచయం చేశారు. పపువా న్యూ గినియాను సందర్శించిన భారత తొలి  ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం.  పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు కూడా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వారు మోదీతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.

తరువాత ప్రధాని మోదీ  తమ ట్వీటులో తనకు దక్కిన ప్రత్యేక ఆదరణ తనకు చిరస్మరణీయంగా ఉంటుందని, ఈ దీవులతో భారతదేశ సంబంధాలు మరింత సమున్నత దిశకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు.  సూర్యాస్తమయం తర్వాత పపువా న్యూ గినియాకు  వచ్చిన ఏ నాయకుడికి కూడా అధికారికంగా స్వాగతం పలకకూడదని ఆ దేశంలో నియమం ఉంది. కానీ ప్రధాని మోదీ  కోసం ఈ దేశం తన సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది.

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం రాత్రిపూట ప్రభుత్వ గౌరవాలతో విదేశీ అతిథులను స్వాగతించదు. కానీ భారతదేశం  ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోదీకి పెరుగుతున్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడి స్థానిక సమయం రాత్రి 10 గంటల తర్వాత మోదీ అడుగుపెట్టారు.

ప్రధాని మరాపే ఆధ్వర్యంలో జరిగే ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కార్పొరేషన్ (ఎఫ్‌ఐపిఐసి) మూడో సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు వచ్చారు. ఈ సమావేశంలో 14  చిన్న దీవుల దేశాలు సభ్యులుగా ఉన్నాయి.  ఈ సదస్సుకు సహ సారధ్యం వహించాలని తమకు ఆహ్వానం పంపించినందుకు తాను సంతోషిస్తున్నానని మోదీ  తెలిపారు. పపువా న్యూ గినియాలో పర్యటించిన అనంతరం ప్రధాని మోదీ ఇక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

2021లో పపువా న్యూ గినియాకు కరోనా వ్యాక్సిన్లను భారత్ భారీగా పంపింది. ఆ దేశం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ సమయంలో సాయం చేసింది. గ్లోబల్ వ్యాక్సిన్లు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ దేశానికి భారత్ ఆపన్నహస్తం అందించింది.

పిచ్చాపాటి వేదికలుగా ఐరాస
కాగా, ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి చివరికి ఇప్పుడు పిచ్చాపాటి వేదికలుగా మారనున్నాయని ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జి 7 సదస్సు నుంచి చేసిన ప్రసంగంలో ఇప్పటికైనా ఈ ప్రపంచ వేదికలు ప్రస్తుత ప్రపంచ వాస్తవికతలను ప్రతిఫలించకపోతే సంస్థలుగా అవి నిరర్ధకం అవుతాయని స్పష్టం చేశారు.

శాంతి సుస్థిరతల పరిరక్షణ బాధ్యత ఐరాసపై ఉందని చెబుతూ మరి వీటికి సవాళ్లు ఏర్పడినప్పుడు వివిధ వేదికల నుంచి ఎందుకు వీటిపై వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయని ప్రధాని ప్రశ్నించారు. ప్రపంచంలో తలెత్తే ఘర్షణలను నివారించుకునేందుకు ఐరాస ఏర్పడినప్పుడు, మరి ఈ బాధ్యతల నిర్వహణలో ఈ సంస్థ ఎందుకు విఫలం అవుతోందని సందేహం వ్యక్తం చేశారు.

చివరికి ఐరాస వేదిక ఇంతవరకూ ఉగ్రవాదంపై నిర్వచనం విషయంలో కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయిందని గుర్తు చేశారు. వీటిన్నింటిని బేరీజు వేసుకుంటే ఒక్క విషయం స్పష్టం అవుతోంది. గత శతాబ్ధంలో ఏర్పాటు అయిన ఈ సంస్థ ఇప్పటి వాస్తవికతలను గుర్తించడం లేదని ప్రధాని తేల్చి చెప్పారు.

21వ శతాబ్ధానికి అనుగుణంగా అప్‌డేట్ కాలేదనే గుర్తించాల్సి ఉంటుందని మోదీ పిలుపిచ్చారు. ఐరాసలో భారీ స్థాయి సంస్కరణల ప్రక్రియకు భారతదేశం డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి ఏళ్ల తరబడిగా విఫలయత్నానికి దిగుతూ వస్తోంది.