కాశ్మీర్ లో జి 20 సమావేశం ముందు కీలక ఉగ్రవాది అరెస్ట్

జమ్మూ కాశ్మీర్‌లో  ఉగ్రవాద ముప్పు నీడలో జి 20 సమావేశం పర్యాటక రంగం గురించి భారీ భద్రతా చర్యల మధ్య సోమవారం ప్రారంభం అవుతున్న సమయంలో  భద్రతా దళాలు కీలకమైన ఉగ్రవాదిని ఆదివారం అరెస్ట్ చేశాయి. ఉగ్రవాద కుట్ర కేసులో ప్రమేయం గల కాశ్మీర్‌కు చెందిన జైషే మహ్మద్ (జెఇఎం) కార్యకర్తను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)  అరెస్టు చేసింది.

ఆ ఉగ్రవాదిని కుప్వారా జిల్లాకు చెందిన ఉబైద్ మాలిక్‌గా గుర్తించారు. నిందితుడు భారత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్​కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ తెలిపింది. సైనికులు, భద్రతా బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌లోని కమాండర్‌కు చేరవేస్తున్నాడని ఎన్​ఐఏ అధికారులు తెలిపారు.

కాగా, ఉగ్రవాది ఉబైద్ నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అతను ఏదో పెద్ద ఉగ్రవాద కుట్రను అమలు చేయడానికి యత్నిస్తున్నాడని అధికారులు చెప్పారు. జూన్ 2022లో కాశ్మీర్​ లోయలో ఉగ్రవాద కుట్రకు సంబంధించి  ఎన్‌ఐఎ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

లోయలో టెర్రర్ ప్లాట్‌ను అమలు చేసేలా నిర్దేశిస్తున్న పాకిస్తానీ కమాండర్‌తో పరిచయం ఉన్న బహుళ ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక హవాలా మార్గాలు, ఆయుధాలు, ఐఈడీలు, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే స్టిక్కీ బాంబులు, మాగ్నెటిక్ బాంబులను భద్రపరచడం, వీటి కోసం నగదు వసూలు చేయడం ద్వారా ఉగ్రవాద కుట్రను అమలు చేయడం గురించి ఈ ఎఫ్​ఐఆర్​లో ప్రస్తావించారు.

ఎన్‌ఐఎ  తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ నుండి డ్రోన్‌ల ద్వారా ఐఈడీలు, పేలుడు పదార్థాలను నిరంతరం భారతదేశానికి పంపిస్తున్నారు. అవి స్థానికంగా ఉండే వారికి చేరుతున్నాయి. భద్రతా దళాలపై దాడి చేయడానికి, కాశ్మీర్​ లోయలోని మైనారిటీలను టార్గెట్​ చేసుకుని వీటిని ఉపయోగిస్తున్నారు. దేశంలో మత సామరస్యాన్ని చెడగొట్టడ, ఉగ్రవాద కుట్ర అమలు చేయడం ద్వారా భారత ప్రభుత్వంపై యుద్ధం ​ప్రకటించడం వీరి ముఖ్య ఉద్దేశ్యం. సోషల్ మీడియా యాప్‌లలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కోడ్ వర్డ్ లలో మెస్సేజులు పంపుకుని కుట్ర పన్నారని  ఎన్‌ఐఎ తెలిపింది.

కాగా, సోమవారం శ్రీనగర్‌లో జీ20 సమావేశం జరగనున్న దృష్ట్యా జమ్మూకశ్మీర్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులోనూ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సమావేశం మే 24 వరకు కొనసాగనుంది. చీనాబ్ నది వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన స్పెషల్​ ఫోర్స్​ వింగ్ ప్రత్యేక పడవలతో పెట్రోలింగ్‌ను పెంచిందని అధికారులు తెలిపారు.

ఈ పడవలు చీనాబ్ నదిలో నిరంతరం గస్తీ కాయడానికి ఉపయోగిస్తున్నారు. ఇక.. నది వెంబడి సరిహద్దు ప్రాంతంలో సెక్యూరిటీకి ప్రత్యేకంగా వీటిని  రూపొందించారు. రాత్రి, పగలు తేడా లేకుండా బోట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఫుట్‌ పెట్రోలింగ్‌, వాహనాల పెట్రోలింగ్‌ కూడా పెంచినట్టు అధికారులు తెలిపారు.