సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త, రచయిత కేతు విశ్వనాథ రెడ్డి ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశ్వనాథరెడ్డి కన్ను మూశారు.  రాయలసీమ కథకు చిరునామాగా నిలిచిన కేతు విశ్వనాథరెడ్డి రెండ్రోజుల క్రితం ఒంగోలులో కుమార్తె దగ్గరికి వెళ్లారు.  సోమవారం ఉదయం 5 గంటలకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.
ఆస్పత్రిలో వైద్యులు ఆయన్ను వెంటిలేటర్ మీద ఉంచారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు. కేతు విశ్వనాథరెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త, కథా రచయితగా గుర్తింపు పొందారు. ఆయన కథలతో వేసిన కథా సంపుటి.. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.
తెలుగు సాహిత్యంలో కురువృద్ధుడిగా పేరుగాంచిన కేతు విశ్వనాథరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురంలో జూలై 10, 1939న జన్మించారు. కేతు విశ్వనాథరెడ్డి తొలి కథ ‘అనాదివాళ్లు’. ఈ కథను సవ్యసాచిలో 1963 లో ప్రచురించారు. వీటితో పాటు కొడవటి కంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు.
విశాలాంధ్ర తెలుగు కథ సంపాదకమండలికి అధ్యక్షుడిగా కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా) పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఇచ్చే పురస్కారాలు ఆయన అందుకున్నారు.
కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.