తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు

హైదరాబాద్‌ రామకృష్ణ మఠంలో సంస్కార్‌ వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. 700 మందికి పైగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియజెప్పే పాటలు రాగయుక్తంగా పాడారు. 
పాటలు పాడే సమయంలోనూ, పాద పూజ సమయంలోనూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం15 రోజుల పాటు నిర్వహించిన వేసవి శిబిరంలో విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
 
కార్యక్రమంలో హైదరాబాద్‌ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ప్రసంగిస్తూ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని చెప్పారు. పాదపూజల వేళ తల్లిదండ్రుల విలువ మరింతగా తెలిసివస్తుందని తెలిపారు. తల్లిదండ్రులకు పూజలు చేయడం భారతదేశంలో అనాదిగా వస్తున్న సంస్కృతి అని, ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు కూడా తెలిసేలా పాదపూజల కార్యక్రమం చేపట్టామని వివరించారు.

కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా రామకృష్ణ మిషన్‌ నుంచి వచ్చిన స్వామి హరిప్రేమానంద, ఇతర స్వాములు, ప్రముఖులు, వాలంటీర్లు పాల్గొన్నారు.