హైదరాబాద్ లో కొత్తగా 29 పోలీస్ స్టేషన్లు

35 ఏళ్ల తర్వాత నగర పోలీస్ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరణ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. నగరంలో కొత్తగా 29 పోలీస్ స్టేషన్లు రానున్నట్లు తెలిపారు. 6 నెలల పాటు రీ ఆర్గనైజేషన్ కమిటీ కూర్చుని కొత్త పోలీస్‌స్టేషన్లకు ప్రతిపాదన చేసిందని, సరిహద్దులను నిర్ణయించిందని పేర్కొన్నారు.

 35 ఏళ్ల కింద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 లక్షల మంది జనాభా ఉండేవారని, ఇప్పుడు 85 లక్షలకు పెరిగిందని చెప్పారు. 1987లో 8,76,126 వాహనాలు ఉంటే ఇప్పుడు 80,70,852 వాహనాలు పెరిగాయని సీపీ చెప్పారు. వాటికి అనుగుణంగా నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, శాంతి భద్రతల పిఎస్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు కలిపి 1.60 కోట్ల మంది జనాభా శాంతి భద్రతలు కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లు, 5 కొత్త ఉమెన్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని వివరించారు.

పోలీస్‌స్టేషన్లలో కేసులు పెరుగుతుండటంతో భారమవుతోందని అంటూ  సెక్రటేరియట్ కోసం కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని ఆనంద్ వెల్లడించారు. సెక్రటేరియట్ పోలీస్‌స్టేషన్‌ను బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సెక్రటేరియట్ సెక్యూరిటీ కోసం ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉంటారని పేర్కొన్నారు.

 సైబర్ క్రైమ్ కోసం ఒక డీసీపీతో పాటు మొత్తం 148 మంది పోలీస్ అధికారులను కేటాయించినట్లు చెప్పారు. జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్స్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని తెలిపారు. కాగా, 35% సివిల్ కానిస్టేబుళ్ల ఖాళీలు ఉన్నాయని, 120 ఎస్‌ఐ పోస్టులు వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 850 హోంగార్డుల పోస్టుల ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఇక నుంచి కమిషనరేట్ పరిధిలో అటాచ్‌మెంట్లు ఉండవని తెలిపారు. డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న సివిల్ పోలీసులను కమిషనరేట్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించామని తెలిపారు. కొత్త పోలీస్‌స్టేషన్లకు సరిపడే వాహనాలు, కంప్యూటర్స్, బైక్స్ ఇస్తామని వెల్లడించారు. కొత్త పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించిందని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. కొత్త పోలీస్ స్టేషన్లతో కలిపి హైదరాబాద్ పోలీస్ కమిషనరెట్‌లో 78 పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు.

అబిడ్స్ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ కలక్టరేట్ బిల్డింగ్, బీఆర్‌కే భవన్‌లో సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్, ఫిలింనగర్‌లో ఆపరేటివ్ సొసైటీ ప్రెమిసెస్‌లో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్, మధురానగర్ పోలీస్ స్టేషన్‌గా రెహ్మత్ నగర్ ఓపీ బిల్డింగ్, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌లో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌లో మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్, బోరబండ ఔట్ పోస్ట్ పోలీస్ వద్ద బోరబండ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.