నావికాదళంలోకి మరో శక్తివంతమైన హెలికాప్టర్ఎంహెచ్ 60 రోమియో

భారత నౌకాదళం అత్యంత శక్తిమంతంగా మారేందుకు మరో ముందడుగు పడింది. ఇండియన్ నేవీ మరో మైలురాయిని చేరుకుంది. ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్ తొలి సముద్ర ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని భారతీయ నౌకాదళం ప్రకటించింది. దేశీయంగా రూపొందిన శత్రు సంహార యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతాపై రోమియో హెలికాప్టర్ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండింగ్ జరుపుకుంది.

దీంతో భారత నౌకాదళ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాలు మరింత మెరుగయ్యాయని నౌకాదళ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికన్ నౌకాదళ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన హెలికాప్టరే ఈ ఎంహెచ్ 60ఆర్. ఎక్కువగా రోమియో అని పిలుస్తుంటారు. అమెరికా వైమానిక సంస్థ ‘లాక్‌హీడ్ మార్టిన్’ వీటిని అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లుగా తయారు చేసింది. దీనికి బహుళ శక్తులు ఉన్నాయి.

ఎన్నో క్లిష్టమైన పనులను ఈ యుద్ధ విమానం సులువుగా చేసుకొస్తుంది. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లో అత్యద్భుతంగా పనిచేస్తుంది. అంతేగాకుండా సముద్రంలో నిఘా కార్యక్రమాలను గుర్తిస్తుంది. షిప్పింగ్ ప్రతికూల కార్యకలపాలను చేస్తుంది. సెర్చ్ అండ్ రెస్య్యూ ఆపరేషన్‌లు చేయగల సామర్థ్యాలు దీని సొంతం.

తీరం నుంచైనా, సముద్రంలో ఉన్నప్పుడైనా రోమియో ఆపరేటర్లు విజయవంతంగా పని పూర్తి చేసుకుని తిరిగి రాగలరు. అధునాతన డిజిటల్ సెన్సార్లు ఇందులో ఉంటాయి.  వీటితో పాటు బహుళ విధాన రేడార్, ఎలక్ట్రానిక్ సహాయక చర్యల వ్యవస్థ, ఎలక్ట్రో-ఆప్టికల్ లేదా ఇన్‌ఫ్రారెడ్ కెమెరా, డేటాలింక్స్, విపత్తు సమయాల్లో మనుగడ సాగించే ఎయిర్‌క్రాఫ్ట్ సర్వైవబిలిటీ సిస్టమ్, డిప్పింగ్ సోనార్, సోనోబైయ్స్ ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకం.

సముద్ర ఉపరితలం, లోపలి భాగంలో ఏమున్నాయో సెన్సార్ల ద్వారా గుర్తించి పరిస్థితులను ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. ఈ సమాచారంతో విమాన సిబ్బంది నౌకలను, జలాంతర్గాములను ట్రాక్ చేసి టార్గెట్ చేస్తారు. ఇలా తీసుకున్న సమాచారంలో ఎలాంటి పొరపాటు ఉండదు. అత్యంత కచ్చితత్వంతో ప్రభావవంతంగా టార్గెట్‌ని పూర్తి చేసేందుకు విమానంలోని ఇంటిగ్రేషన్ సిస్టం సహకరిస్తుంది. 

టోర్పడోలు, గాలి నుంచి భూమిపైకి ప్రయోగించే క్షిపణులు, రాకెట్లను ఎంహెచ్60 రోమియో కలిగి ఉంటుంది. వీటితో పాటు విమాన సిబ్బంది వద్ద తుపాకులు కూడా ఉంటాయి. ఈ విమానాలను దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో భారత్ డీల్ కుదుర్చుకుంది. మొత్తంగా 2.6 బిలియన్ డాలర్ల విలువైన 24 హెలికాప్టర్లను దిగుమతి చేసుకోవడానికి 2020 ఫిబ్రవరిలోనే అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్‌ని పొందింది.

నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఫారెన్ మిలిటరీ సేల్స్ కింద రూ.14వేల కోట్లకు(1.7బిలియన్ డాలర్లు) బేరమాడింది. వీటిలో మూడింటిని అమెరికాలోని శాన్ డియాగో బేస్‌లో 2021లోనే భారత్‌కు డెలివరీ చేసింది. అనంతరం అక్కడే భారతీయ నౌకాసిబ్బందికి శిక్షణను అందించింది. 2022లో మరో విడతలో 3 హెలికాప్టర్లను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ కేరళలో డెలివరీ చేసింది. ఇందులోని ఒక హెలికాప్టరే తాజాగా ఐఎన్‌ఎస్ కోల్‌కతా యుద్ధనౌకపై ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. మిగతా హెలికాప్టర్ల డెలివరీ 2025 నాటికి పూర్తి కానుంది.