
ఉక్రెయిన్‌పై యుద్ధం తర్వాత అగ్రరాజ్యం అమెరికా -రష్యా మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో క్రెమ్లిన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా రష్యా యూఎస్‌పై ప్రతిస్పందనకు పూనుకుంది. ఇందులో భాగంగానే సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలువురు ప్రముఖులపై ఆంక్షలు విధించింది.
మొత్తం 500 మంది అమెరికన్లు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం విధించిన రష్యా వ్యతిరేక ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నిషేధం విధించినట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు నిషేధించిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు ఒబామాతోపాటు అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్, టెలివిజన్ స్టార్స్ స్టీఫెన్ కోల్‌బెర్గ్, జిమ్మీ కిమ్మెల్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అదేవిధంగా ఈ జాబితాలో 45 మంది యూఎస్ చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు కూడా ఉన్నారు. అయితే ఏయే కారణాలతో వీరిపై నిషేధం విధించారన్న విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.
గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్‌కోవిచ్ కు కాన్సులర్ యాక్సెస్ కోసం చేసిన అమెరికా అభ్యర్థనను కూడా తిరస్కరించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో ఐక్యరాజ్యసమితిలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పర్యటనను కవర్ చేయాలనుకున్న రష్యా జర్నలిస్టులకు అమెరికా వీసాలు నిరాకరించింది.
ఆ చర్యకు ప్రతిస్పందనగానే.. ఇవాన్‌కు కాన్సులర్ యాక్సెస్‌ను తిరస్కరిస్తున్నట్లు మాస్కో తెలిపింది. కాగా, గూఢచర్యం కేసులో ఇవాన్‌ను ఈ ఏడాది మార్చిలో రష్యా పోలీసులు అరెస్టు చేశారు.
More Stories
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
గాజాలో అమెరికా ఎత్తుగడలకు సౌదీ చెక్