హిరోషిమాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

హిరోషిమా పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం భయంతో వణికిపోతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపానులోని హిరోషిమా నగరంలో శాంతికి చిహ్నంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్కరించారు.

జి7 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ శుక్రవారం జపాను చేరుకున్నారు. హిరోషిమాలో శనివారం ఆయన 42 అంగుళాల మహాత్మా గాంధీ బస్ట్ సైజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్ముని విగ్రహాన్ని హిరోషిమాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు, దాన్ని ఆవిష్కరించడానికి తనను ఆహ్వానించినందుకు జపాను ప్రభుత్వానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అణుబాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో నగరం యావత్తు ధ్వంసం కాగా 1,40,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం నేడు వాతావరణ మార్పులు, ఉగ్రవాదం బెడదను ఎదుర్కొంటోందని చెబుతూ గాంధీ సిద్ధాంతాలతోనే ఈ బెడదలను ఎదుర్కోగలమని నరేంద్ర మోదీ తెలిపారు.

 గాంధీ సిద్దాంతాలను పాటించడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అని ఆయన చెప్పారు. మహాత్ముని అహింసా సిద్ధాంతం ఈ విగ్రహం ద్వారా ప్రపంచ ప్రజలకు వ్యాప్తి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. తాము బహుమతిగా ఇచ్చిన బోధి మొక్కను జపాను ప్రధాని హిరోషిమాలో నాటినట్లు విని తాను చాలా సంతోషించానని ఆయన చెప్పారు.

జో బిడెన్, రిషి సునాక్ ఆత్మీయ పలకరింపు

కాగా జీ-7 సదస్సులో భాగంగా ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీని పలకరించేందుకు స్వయంగా ఆయన ఉన్న వేదిక దగ్గరకు వచ్చారు అమెరికా అధ్యక్షులు బైడెన్‌. దీనిని గమనించి మోదీ కూడా లేచి బైడెన్‌ను పలకరించారు. ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఆలింగనం చేసుకున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అలాగే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్బంగా వారి మధ్య కొంతసేపు సంభాషణ కూడా జరిగింది. భారత్‌, జపాన్‌లతో పాటు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల అధినేతలు ఈ జీ-7 సదస్సుకు హాజరయ్యారు.

ఈ సదస్సులో కనెక్టివిటీ, భద్రతా, అణు నిరాయుధీకరణ, ఆర్ధిక భద్రతా , వాతావరణ మార్పులు, ఆహరం, ఆరోగ్యం, ప్రాంతీయ సమస్యలు వంటి అంశాలతో పాటు కొన్ని ప్రాధాన్యత అంశాలపై చర్చించే అవకాశం ఉందని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పుకొచ్చారు.

అలాగే ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ, పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకామి, ప్రముఖ జపనీస్ చిత్రకారుడు హిరోకో తకయామాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రొఫెసర్ టోమియో మిజోకామి, హిరోకో తకయామాను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.