మోదీ అంటేనే దేశ అభివృద్ధికి నాంది

మోదీ అంటేనే దేశ అభివృద్ధికి నాంది అని, తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ పాలన ఆదర్శనీయమని కేంద్ర పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. రామగుండం పర్యటనలో భాగంగా శనివారం గోదావరిఖని శారదనగర్‌ లోని రెడ్డి భవన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు.
 
 దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి పదవులను పంచుకోవడంలోనే కాలం వెళ్లదీస్తోంద‌ని, ముఖ్యమంత్రి పదవి పంచుకునే దుస్థితికి కాంగ్రెస్‌ పార్టీ చేరుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భరోసా వ్యక్తం చేసారు.
 
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బిఆర్వైస్ ప్రభుత్వం ప్రజలకు గారడి మాటలు చెబుతూ మాయమాటలతో మోసపూరిత వాగ్దానాలు చేయడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలన అంటేనే తెలంగాణ బంగారు తెలంగాణ కాదని, కేసీఆర్ది మాత్రమే బంగారు కుటుంబమని ధ్వజమెత్తారు. తెలంగాణలో అభివృద్ధి చేయలేనివాడు దేశంలో అభివృద్ధి చేస్తానని ముందుకు పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
 
కేసీఆర్‌ పాలన చేపట్టిన నాటినుండి తెలంగాణ అధ్వాన్న స్థితికి చేరుకుందని, ఉచిత వాగ్దానాలు తప్ప ఆచరణలో శూన్యమని కేంద్ర మంత్రి విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబమే అవినీతి కుటుంబంగా మారిపోయిందని పేర్కొంటూ  ప్రాజెక్టుల పేరుతో అనేక అవినీతి పనులు చేస్తూ కమిషన్లు దండుకుంటూ ముందుకు పోతున్నారని ఆరోపించారు.
 
పెద్దపల్లి జిల్లాలో సైతం భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో బలోపేతం చేయాలని, మూడు నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరవేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని రూపాల సూచించారు. మోదీ అధికారం చేపట్టిన నాటినుండి తెలంగాణలో రోడ్లు, పరిశ్రమలు, రైతుల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు.
 
మూసివేతకు గురైన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి ఎరువుల కర్మాగారం ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని గుర్తు చేశారు. భారతదేశ అభివృద్ధి నరేంద్ర మోదీ లక్ష్యమని చెబుతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా నరేంద్ర మోదీ  భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తున్నారని తెలిపారు.
 
 దేశంలో ఎన్ని పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక ఎత్తులు వేస్తున్నాయని, ఆ ఎత్తులను చిత్తు చేసి రాబోయే ఎన్నికల్లో సైతం ప్రజల ఆశీర్వాదంతో ఆదర్శవంతమైన పాలనను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ సారథ్యంను ప్రజలు ఇంకా కోరుకుంటున్నారని చెబుతూ మూడోసారి దేశంలో కాషాయ జెండా ఎగురుతుందని భరోసా వ్యక్తం చేశారు.
 
అవినీతి ప్రభుత్వాలకు ప్రజలు చరమగీతం పాడనున్నారని, అవినీతి ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా అవినీతికి తావులేని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల, రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే, టిఎస్‌ ఆర్టిసి మాజీ చైర్మన్‌ సోమవారపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.