శ్రీన‌గ‌ర్‌లో జీ20 సదస్సుకు చైనా పేచీ

జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌ర‌గ‌నున్న జీ20 స‌మావేశాల‌ను చైనా బ‌హిష్క‌రించింది. జ‌మ్మూక‌శ్మీర్ వివాదాస్ప‌ద ప్రాంత‌మ‌ని, అక్క‌డే స‌మావేశాల‌కు తాము హాజ‌రుకాబోమ‌ని చైనా తెలిపింది. జీ20 టూరిజం వ‌ర్కింగ్ గ్రూపు స‌మావేశాలు శ్రీన‌గ‌ర్‌లో జ‌ర‌గ‌నున్నాయి. కాగా, సోమవారం నుంచి జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగనున్న జీ20 సదస్సుకు తాము హాజరుకావడం లేదని ప్రకటించింది.
వివాదాస్పద భూభాగంలో  సమావేశాలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చైనా చెప్పింది. కశ్మీర్‌లో నిర్వహించే ఇలాంటి భేటీలకు తాము వచ్చేది లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు. శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు నిర్వహించడంపై చైనా అభ్యంతరం వ్యక్తంచేయడం ఇదే మొదటిసారి.
అయితే కశ్మీర్‌పై ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు జీ20 సమావేశాల నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. చైనా చేస్తున్న వాద‌న‌ల‌కు భారత్ తిప్పికోట్టింది. స్వంత భూభాగంలో స్వేచ్ఛగా సమావేశాలను నిర్వ‌హించుకుంటామ‌ని తేల్చి చెప్పింది.
చైనాతో సంబంధాలు స‌జావుగా ఉండాలంటే, స‌రిహ‌ద్దు వ‌ద్ద శాంతి, సామ‌రస్యం ముఖ్య‌మ‌ని భార‌త్ పేర్కొన్న‌ది. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు శ్రీనగర్‌లోని షేర్‌ ఏ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెషన్‌ సెంటర్‌లో పర్యాటక రంగంపై జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ మూడో సదస్సు జరుగనున్నది. దీంతో అక్క‌డ భద్రతను పెంచారు. జీ20 దేశాల‌కు చెందిన సుమారు 60 మంది ప్ర‌తినిధులు శ్రీన‌గ‌ర్‌కు రానున్నారు. ఈ స‌మావేశాల‌కు ట‌ర్కీ హాజ‌రుకావ‌డంలేదు.


ఈ ఈవెంట్‌కు సౌదీ అరేబియా ఇంకానమోదు చేసుకోలేదు. ప్ర‌స్తుతం శ్రీన‌గ‌ర్‌లో మెరైన్ క‌మాండోలు, ఎన్ఎస్‌జీ గార్డులు ప‌హారా కాస్తున్నారు. దాల్ స‌ర‌స్సులో మెరైన్ పోలీసులు తిష్ట‌వేశారు. ఎన్ఎస్జీ క‌మాండోలు స్థానిక పోలీసులు, పారామిలిట‌రీ ద‌ళాలు చెకింగ్ నిర్వ‌హిస్తున్నారు. హౌజ్‌బోట్ల‌లో త‌నిఖీలు చేప‌డుతున్నారు.