ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం రివ్యూ పిటీషన్

దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన కేసులో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.
 
అధికారుల బదిలీ, పోస్టింగ్‌ హక్కును ఢిల్లీ ప్రభుత్వానికి కల్పిస్తూ మే 11న తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో కేంద్రం మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యం చేసుకునేలా కొత్తగా ‘నేషనల్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ అథారిటీ’ పేరిట కొత్త ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. అధికారుల బదిలీలు, విజిలెన్స్‌ తదితర అంశాల్లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఎల్‌జీ దృష్టికి తీసుకెళ్లాల్సి రానుంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఎల్‌జీ విభేదించే అధికారం, అవసరమైతే దాన్ని వెనక్కి తిప్పి పంపే అధికారం సైతం ఇచ్చింది. దేశ రాజధానిగా ఢిల్లీకి ప్రత్యేక పాలన వ్యవస్థ ఉందని, స్థానిక ప్రయోజనాలతోపాటు, దేశ ప్రజాస్వామిక ప్రయోజనాలను కాపాడడంలో ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్రానికి బాధ్యత ఉంటుందని పేర్కొంది.

ఇందుకోసమే శాశ్వత అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ అథారిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటారని, ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్‌ హోం సెక్రెటరీ ఇందులో ఉంటారని చెప్పింది. అన్ని నిర్ణయాలనూ ఈ అథారిటీలో మెజారిటీ సభ్యుల ఓటింగ్‌ మేరకు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ ప్రకారం  అధికారుల పోస్టింగ్‌పై ఢిల్లీ ప్రభుత్వం కచ్చితంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే తుది నిర్ణయం.

ముఖ్యమంత్రి ఒక్కరే బదిలీ నిర్ణయం తీసుకోలేరు. ఇదిలా ఉండగా, మంత్రివర్గం సలహా మేరకు నడుచుకోవాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు మరోసారి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సూచిస్తూ రెండు వారాల్లోగా విద్యుత్తు నియంత్రణ కమిటీ చైర్‌పర్సన్‌ను నియమించాలని ఆదేశించింది.

కేంద్రం తీసుకొచ్చిన ‘సేవలపై ఆర్డినెన్స్’పై స్పందిస్తూ  ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికారాలను ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బిజెపి జీర్ణించుకోలేకపోతోందని  ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి ఆతిషీ దుయ్యబట్టారు. ఢిల్లీలో పెత్తం చెలాయించడానికే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాన్ని కట్టబెట్టేందుకే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని ఆమె ధ్వజమెత్తారు.