చైనా ఓడను కాపాడేందుకు భారత నావికాదళం

చైనాకు చెందిన చేపలు పట్టే నౌక హిందూ మహాసముద్రంలో మంగళవారం బోల్తా పడింది. మునుగుతున్న ఆ షిప్‌లో 39 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది చైనీయులు కాగా, 17 మంది ఇండోనేషియా, ఐదుగురు ఫిలిప్పిన్‌ జాతీయులు. వీరిని కాపాడేందుకు భారత్‌తో సహా పలు దేశాల సహాయాన్ని చైనా కోరింది.
 
ఈ నేపథ్యంలో చైనా నేవీ విన్నపానికి ఇండియన్‌ నేవీ స్పందించింది. చైనా చేపల పడవను కాపాడడానికి, వెతకడానికి భారత నావికా దళం పి81 సముద్ర గస్తీ విమానాన్ని పంపింది. ప్రతికూ వాతావరణం ఉన్నప్పటికీ భారత విమానం చాలా శోధించింది. మునిగిపోయిన నౌకకు చెందిన అనేక వస్తువులను గుర్తించింది.
 
చైనా చేపల పడవ లూ పెంగ్ యువాన్ వై మునిగిపోగా, మానవతా చర్యలో భాగంగా భారత నావికా దళం తన విమానాన్ని పంపింది. భారత దేశానికి దాదాపు 900 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ హిందూ మహాసముద్రంలో వెతికింది. మునిగిపోయిన చైనా పడవ సిబ్బందిలో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌కు చెందిన పౌరులు ఉన్నారు.
 
అలాగే ప్రమాదం జరిగిన సంఘటనా ప్రాంతానికి చైనా నౌకలు చేరేందుకు సహకరించినట్లు వెల్లడించింది.  కాగా, గురువారం నాటి సెర్చ్‌ ఆపరేషన్‌లో రెండు మృతదేహాలు లభించినట్లు చైనా మీడియా తెలిపింది. జాడలేని మిగతా సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
 
అయితే మరణించిన ఇద్దరు సిబ్బంది ఏ దేశానికి చెందినవారో అన్నది చైనా మీడియా వెల్లడించలేదు. మరోవైపు పశ్చిమ ఆస్ట్రేలియాకు 5000 కిలోమీటర్ల దూరంలో చైనా ఫిషింగ్‌ షిప్‌ మునగడంతో సహాయం కోసం మూడు విమానాలు, నాలుగు నౌకలను ఆ దేశం పంపింది.  మరిన్ని విమానాలు, నౌకలు, సిబ్బందిని పంపుతున్నట్లు ఆస్ట్రేలియన్ మారిటైమ్ సేఫ్టీ అథారిటీ (ఏఎంఎస్‌ఏ) ప్రతినిధి తెలిపారు. ఇతర దేశాల బృందాలతో కలిసి రెస్క్యూలో పాల్గొంటామని చెప్పారు.