పాశ్చాత్య దేశాల్లో వాక్‌ స్వాతంత్య్రానికి ముప్పు

పాశ్చాత్య దేశాల్లో మునుపెన్నడూ లేనంతగా వాక్‌ స్వాతంత్య్రానికి ముప్పు పొంచి ఉందని ప్రముఖ రచయిత సల్మాన్‌రష్దీ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాజకీయంగా జేమ్స్‌బాండ్‌ సరైన వ్యక్తిగా నిరూపించేందుకు చేస్తున్న హాస్యపూరిత యత్నాలను కూడా విమర్శించారు. అలాంటి వాటిని ప్రతిఘటించాలని పిలుపిచ్చారు.

 ఆ కాలానికి చెందిన ప్రామాణిక పుస్తకాలను ఉన్నతమైనవిగానే భావించాలని, అవి కష్టంగా ఉంటే చదవవద్దని హితవు చెప్పారు. మరో పుస్తకాన్ని ఎంచుకోవాలని, కానీ నేటి భిన్న వైఖరిలో నిన్నటి పనిని రీమేక్‌ చేయడానికి ప్రయత్నించవద్దని సూచించారు.  రచయిత పుస్తకాలను ప్రచురించే ఇయాన్‌ ఫ్లెమింగ్‌ పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌   నవలలను సమీక్షించేందుకు కొంత మంది పాఠకులను నియమించింది.

అవినీతి వ్యక్తుల గురించిన వ్యాఖ్యలను తొలగించడమో లేదా పునర్‌ లిఖించడమో చేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ బుక్‌ అవార్డ్స్‌లో ఫ్రీడమ్‌ టు పబ్లిష్‌ అవార్డును ఆమోదిస్తూ రష్దీ ఓ వీడియో సందేశాన్ని పంపారు. గతేడాది జరిగిన దాడి నుండి కోలుకునేందుకు తన న్యూయార్క్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నానని ఆ సందేశంలో పేర్కొన్నారు.

గతేడాది వేసవిలో రష్దీపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వాక్‌ స్వాతంత్య్రం కోసం పోరాడే ప్రతి ఒక్కరి కోసం తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నానని రష్దీ తెలిపారు. లండన్‌లోని గ్రోస్వెనర్‌ హౌస్‌ హోటల్‌లో బ్రిటీష్‌ బుక్‌ అవార్డ్స్‌ వేడుక జరిగింది.