ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు ‘స్టే’

ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు వివాదంగా మారుతోంది. విగ్రహ నమూనాపై ఇప్పటికే పలు కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం చేస్తుండగా ఇదే అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై గురువారం విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది.
 
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇస్కాన్‌, యాదవ సంఘాలు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ సహా నిర్వాహకులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహన్నిఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు నిర్వాహకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దాదాపు రూ.3 నుంచి రూ. 4 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దీన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించారు. అయితే ఈ విగ్రహ రూపం శ్రీకృష్ణుడి గెటప్ లో ఉండటం వివాదానికి కారణమవుతున్నది. తాము దేవుడిగా కొలిచే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ తాము పూజించే శ్రీకృష్ణుడి రూపంలో మాత్రం వద్దని వారిస్తున్నాయి.

ఇదే విషయంపై విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన యాదవ సంఘాల ప్రతినిధులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కరాటే కల్యాణి తో పాటు పలు హిందూ సంఘాలు కూడా ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఆయా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన హైకోర్టు ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది.