77 రైల్వే స్టేషన్లలో వన్ స్టేషన్ – వన్ ప్రొడక్ట్‌ ఔట్ లెట్స్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 72 రైల్వే స్టేషన్లలో 77 ‘వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ” ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా చేతివృత్తులు, హస్తకళలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో 35 రైల్వే స్టేషన్లలో 37 ‘ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్’ 37 అవుట్‌లెట్‌లు ఏర్పాటైనట్లు వివరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు మార్కెట్‌ను అందించడంతో పాటు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడం ద్వారా స్థానిక, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.

దక్షిణ మధ్య రైల్వేలో  మొదట ఆరు రైల్వే స్టేషన్లలో 30 రోజుల ట్రయల్‌గా ప్రవేశపెట్టగా  అద్భుతమైన స్పందన లభించడంతో, పైలెట్ ప్రాజెక్ట్ కింద జోన్‌లోని డెబ్బై రైల్వే స్టేషన్‌లలో అవుట్‌లెట్‌లు విస్తరించాయి. ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 72 రైల్వే స్టేషన్‌లకు విస్తరించాయి.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో స్థానిక ఉత్పత్తులకు అధిక ఆదరణ అందించే ‘వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్’ యొక్క 77 అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, గుడివాడ మొదలైన వాటితో సహా 35 రైల్వే స్టేషన్‌లలో ఈ ఔట్‌లెట్స్‌ ఏర్పాటయ్యాయి.

కొన్ని ఉత్పత్తులలో సాంప్రదాయ కలంకారి చీరలు, స్థానిక నేత కార్మికుల చేనేతలు ఉన్నాయి. జనపనార ఉత్పత్తులు, అనుకరణ ఆభరణాలు, చెక్క హస్తకళలు, గిరిజన్ ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా పొడులు, పాపడాలు వంటి స్థానిక వంటకాలు, షెల్ పెయింటింగ్స్ మరియు రైస్ ఆర్ట్ మొదలైనవి రైల్వే స్టేషన్లలో విక్రయిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ వరకు రైలు పొడిగింపు

కాగా, ట్రైన్‌ నంబర్ 12861/12862 విశాఖపట్నం – కాచిగూడ – విశాఖపట్నం రైలును ఇకపై మహబూబ్‌నగర్‌ వరకు నడుపుతారు. మహబూబ్‌ నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉందానగర్‌ ప్రజలకు రైలును పొడిగించడంతో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.  మే 20 నుంచి కొత్త షెడ్యూల్ అమలులోకి వస్తుంది. కాచిగూడ తర్వాత ఈ రైలు ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

విశాఖపట్నం నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరే రైలు కాచిగూడకు మరుసటిరోజు ఉదయం 6.45కి, ఉందానగర్‌ 7.19, షాద్‌నగర్‌ 7.44, జడ్చర్ల 8.15, మహబూబ్‌నగర్‌కి ఉదయం 9.20కి చేరుతుంది.

విశాఖ-కాచిగూడ మధ్య మిగిలిన స్టేషన్ల మధ్య రైలు వేళల్లో ఎలాంటి మార్పు లేదని ద.మ.రైల్వే తెలిపింది. మహబూబ్‌నగర్‌ నుంచి సాయంత్రం 4.10 గంటలకు బయలుదేరే రైలు జడ్చర్ల 5.26కి, షాద్‌నగర్‌ 4.57, ఉందానగర్‌ 5.23, కాచిగూడ 6.10, విశాఖకు మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు చేరుకుంటుంది.