బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిన తెలంగాణ బీజేపీ

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది.
 
విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ (సంత్రుప్తస్థాయి) పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.
 
 హైదరాబాద్ లోని నాగోల్ లో గురువారం జరిగిన తెలంగాణ బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సహా పెద్ద ఎత్తున బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ను సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకతీస్తూ విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు స్టాచ్యురేషన్ ప్రాతిపదికన ఆర్దిక సాయం చేస్తాంమని, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో గెలిచి రాలేని బీసీ కులాలకు ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు.
 
 రాబోయే ఎన్నికల్లో బీసీల ఎజెండాగా చేసుకుని బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలి ప్రధానిగా చేసిన జవహార్ లాల్ నెహ్రూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్,  బీసీల విషయంలో మాత్రం కమిషన్ వేసి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని అంబేద్కర్ చెప్పినా నెహ్రూ వినలేదని విమర్శించారు.
 
బీసీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన నెహ్రూకు నిరసనగా  అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పుడు దిగొచ్చి కాకా కళేకర్ కమిషన్ ను నియమించిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత నివేదిక ఇచ్చిందని, అందులో 2399 బీసీ కులాల్లో 8 వందలకుపైగా కులాలు అత్యంత వెనుకబడ్డాయని నివేదించిందని తెలిపారు.
 
కానీ నెహ్రూ కనీసం ఆ నివేదికను బుట్టదాఖలు చేసి బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబించారని, అంతేగాకుండా ఆర్దిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలే తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు ఇస్ దేశ విభజనకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ నెహ్రూ అన్న రాష్ట్రాలకు లేఖ రాశారని తెలిపారు.
 
 మొరార్జీ ప్రధాని అయ్యాక బీపీ మండల్ కమిషన్ ను ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్నారని, 52 శాతం బీసీ జనాభా ఉందని, 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక ఇస్తే దానిని పార్లమెంట్ లో ఆమోదించేలోపు అంతర్గత కలహాలవల్ల ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని గుర్తు చేశారు. ఆ తరువాత ప్రధానులుగా  పనిచేసిన ఇందిరా గాంధ, రాజీవ్ గాంధీలు ఆ ఊసే ఎత్తలేదని చెప్పారు. 
వీపీసింగ్ హయాంలో మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తూ ఆమోదిస్తే ఆ సిఫారసులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ రెండున్నర గంటలు మాట్లాడారని డా. లక్ష్మణ్ తెలిపారు. అంతేగాకుండా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ యూఐ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎక్కిందని,  అయినా 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని ప్రకటించిందని వివరించారు.
 
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన పార్టీ బీజేపీ అంటూ ఛాయ్ అమ్ముకునే పేద కుటుంబానికి చెందిన బీసీ వ్యక్తి నరేంద్రమోదీని ప్రధానిగా చేసిన చరిత్ర బీజేపీదే అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయడంతోపాటు అగ్ర కులాల్లోని పేదలకు సైతం రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత మోదీదే అని తెలిపారు.