ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు!

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అవినీతి కేసులో అరెస్ట్ చేసినా సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొంది రెండు రోజులకే బైటకు రావడంతో, ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త ఆరోపణలతో ఆయన ఇంటిని సైనికులు ముట్టడించేటట్లు చేసింది. తాజాగా, లాహోర్ లోన జమాన్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని పంజాబ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
 
 24 గంటల్లోగా వారిని ప్రభుత్వానికి అప్పగించాలని డెడ్ లైన్ పెట్టింది. ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో సుమారు 40 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు తమకు ఇంటలిజెన్స్ నుంచి విశ్వసనీయ సమాచారం అందిందని పంజాబ్ మంత్రి ఆమిర్ మీర్ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ను మళ్లీ అరెస్ట్ చేస్తే, ఈ ఉగ్రవాదులు రంగంలోకి దిగి, విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
 
మే 9న పాక్ మిలటరీ కేంద్రాలపై జరిగిన దాడి కూడా ఇమ్రాన్ కుట్రేనని ఆరోపించారు. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను మరోసారి అరెస్ట్ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో ఆమిర్ మీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇలా ఉండగా, ఇమ్రాన్  ఖాన్  బెయిల్  పిటిషన్​పై తీర్పును లాహోర్  హైకోర్టు రిజర్వు చేసింది. ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ పంజాబ్  ప్రావిన్సులో ఆయన మద్దతుదారులు ప్రభుత్వ వాహనాలు, భవనాలను ధ్వంసం చేశారు. దీంతో పంజాబ్ ప్రావిన్సులో ఇమ్రాన్ పై పలు కేసులు నమోదయ్యాయి.
 
ఈ కేసుల్లో బెయిల్  ఇవ్వాలని కోరుతూ ఈ నెల 13న ఇమ్రాన్ మరో  పిటిషన్  దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్​పై లాహోర్ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విచారణకు ఇమ్రాన్ హాజరు కాలేదు. పంజాబ్ ప్రభుత్వ అడ్వొకేట్.. ఇమ్రాన్ బెయిల్ పిటిషన్​ను వ్యతిరేకించారు. ఆయనకు బెయిల్  ఇవ్వకూడదని కోరారు.
 
అయితే, తన క్లయింట్ ముందస్తు అరెస్ట్​ను అడ్డుకోవడానికి బెయిల్ కోరుతున్నారని, ప్రొటెక్టివ్  బెయిల్  కాదని ఇమ్రాన్  అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఈ కేసును లార్జర్  బెంచ్​కు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న తర్వాత లాహోర్  హైకోర్టు ఈ పిటిషన్​పై తీర్పును రిజర్వు చేసింది.
 
 కాగా.. హింసను రెచ్చగొట్టారని, దేశద్రోహానికి పాల్పడ్డారని ఇమ్రాన్​పై నమోదైన కేసుల్లో ఆయన బెయిల్ గడువును ఇస్లామాబాద్  హైకోర్టు జూన్  8 వరకు పొడిగించింది. ఈ నెల 9 తర్వాత ఇమ్రాన్ పై నమోదైన కేసుల్లో ఆయనను అధికారులు అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్  కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.