ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌పై అర్థ‌రాత్రి భీక‌ర దాడి

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌పై అర్థ‌రాత్రి భీక‌ర దాడి
ర‌ష్యా మ‌ళ్లీ అసాధార‌ణ రీతిలో విరుచుకుప‌డింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌పై అర్థ‌రాత్రి భీక‌ర దాడి చేసింది. సోమ‌వారం రాత్రి కీవ్‌పై ప‌లు మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ప్ర‌యోగించిన యూఏవీల‌ను, ఇత‌ర క్షిప‌ణుల‌ను ఉక్రెయిన్ స‌మ‌ర్థ‌వంతంగా ఢీకొట్టింది.
 
ర‌ష్యాకు చెందిన దాదాపు 18 మిస్సైళ్ల‌ను ఉక్రెయిన్ వైమానిక ద‌ళం కూల్చివేసిన‌ట్లు కీవ్ మేయ‌ర్ విటాలీ క్లిచ్‌కో తెలిపారు. కీవ్‌పై నాలుగు వైపుల నుంచి ర‌ష్యా దాడి చేసిన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్ల‌డించింది. 18 ర‌కాల‌ ఎయిర్‌, సీ, ల్యాండ్ మిస్సైళ్ల‌ను కూల్చివేసిన‌ట్లు జ‌న‌ర‌ల్ వ‌లేరి జాలుజ్నివి తెలిపారు. ఆ క్షిప‌ణుల జాబితాను ఆయ‌న విడుదల చేశారు.
ఆరు కేహెచ్‌-47ఎం2 కింజాల్ ఏరోబాలిస్టిక్ మిస్సైళ్ల‌ను ఆరు మిగ్‌-31కే విమానాల నుంచి ఫైర్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. న‌ల్ల‌స‌ముద్రంలోని నౌక‌ల నుంచి 9 కాలిబ‌ర్ క్రూయిజ్ మిస్సైళ్ల‌ను ర‌ష్యా ప్ర‌యోగించింది. ఎస్-400 ఇస్కాండ‌ర్‌-ఎం నుంచి మూడు ల్యాండ్ మిస్సైళ్ల‌ను కూడా ర‌ష్యా వ‌ద‌లిన‌ట్లు ఉక్రెయిన్ అధికారి చెప్పారు.
ర‌ష్‌యా లాంచ్ చేసిన డ్రోన్ల‌ను కూడా ఉక్రెయిన్ ద‌ళాలు కూల్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. షాహిద్‌-136-131 డ్రోన్ల‌తో ర‌ష్యా దాడి చేసింద‌ని, అయితే అన్ని డ్రోన్ల‌ను నేల‌మ‌ట్టం చేసిన‌ట్లు జాలుజ్నివి తెలిపారు.

ఇలా ఉండగా, అంతకు ముందు రోజే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఆకస్మిక ఐరోపా పర్యటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే అధ్యక్షులతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం జర్మనీలో అడుగుపెట్టిన ఆయన  ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ స్కాల్జ్‌తో భేటీ అయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి స్వాధీనం చేసుకోడానికి ఎదురుదాడికి దిగుతామని జెలెన్‌స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.

అంతేకాదు, ఆక్రమించుకున్న తమ భూభాగాలను రష్యా నుంచి తీసుకుంటామని, మాస్కోపై దాడి చేసేంత ఆయుధ సంపత్తి, సామర్ధ్యం తమకు లేదని చెప్పారు. తమకు సాయంగా 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలీసా ప్యాలెస్‌లో ఇమ్యానుయేల్ మెక్రాన్‌ను కలిశారు. అవసరమైన సైనిక సాయం చేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘ఉక్రెయిన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం.. కీవ్ అత్యంత తక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త సాయం సిద్ధం చేస్తున్నాం’ అని హామీ ఇచ్చారు.  అటు నుంచి సోమవారం ఉదయం యూకేకు చేరుకున్న జెలెస్కీ.. ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ను కలుసుకున్నారు.