తెలుగు రాష్ట్రాల్లో ఏనాడూ చూడని ఎండల తీవ్రత

 
* ఏడుగురు మృతి * హైదరాబాద్ రాజమండ్రిలలో 49 డిగ్రీలు
 
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతుండటంతో పాటు ఉక్కపోతకు వేడిగాలి కూడా తోడవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత ఎన్నడూ చూడని విధంగా ఉంది. వడదెబ్బకు ప్రజలే ప్రాణాలు పోతున్నాయి. ఏపీలో నలుగురు, తెలంగాణ ముగ్గురు ఎండ తీవ్రతతో మృతి చెందారు.
 
గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోయాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడా అనే రీతిలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉక్కపోత, వడగాల్పులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  మంగళవారం హైదరాబాద్, రాజమండ్రిల్లో రికార్డు స్థాయిలో 49 డిగ్రీలు, ఏలూరులో 48, కొత్తగూడెం, మిర్యాలగూడలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు అత్యధికంగా 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 3 రోజులు ఇదే తీవ్ర స్థాయిలో ఎండలు, వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
 
పగటి పూట 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, కొండాపురంలో 46.4 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగినంత నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
 
సూర్యుడి ప్రతాపంలో ఉత్తర తెలంగాణ ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజులుగా తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. సోమవారం 11 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఎండ వేడిమి అత్యధికంగా ఉంది.
 
మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిరు వ్యాపారులు, పనులపై రోడ్లపైకి వెళ్లిన వాళ్లు ఎండదెబ్బకు గురవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 1.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
 
అదే విధంగా ఈ నెల 25 నుంచి రోహిణీ కార్తె మొదలవుతోంది. అప్పటి నుంచి ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయి. రోహిణీ కార్తె జూన్ 7 వరకు కొనసాగుతోందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెలలో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ కేంద్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఎండలు తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.