పార్టీ మార్పు కధనాలు కొట్టేసిన బిజెపి ఎంపీ బాబురావు

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కొట్టిపారేసారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ కర్ణాటకలో  గెలవగానే దేశం మొత్తం విజయం సాధించినట్టు సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.
 
కర్ణాటకలో ఓటమి చెందిన బీజేపీ ఓట్ల శాతం తగ్గలేదని, ప్రజా బలం తగ్గిపోలేదని ఆయన గుర్తు చేశారు. ము చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని ఆ విషయాన్ని మర్చిపోవద్దని హితవు చెప్పారు. తను పార్టీ మారుతున్నట్టు తప్పుడు కథనాలు ప్రచురించిన వారికి న్యాయాయపర మైన చర్యలు తీసుకుంటానని బాపురావు హెచ్చరించారు.
 
‘‘నాపై అర్థం లేని ఆరోపణలు బాధాకరం. ఈ నెల 27న నా కొడుకు పెళ్లి ఉంది. పెళ్లి కార్డులు అన్ని పార్టీల వారికీ ఇస్తాం. పార్టీలకు అతీతంగా పెళ్లికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నాను. అందులో భాగంగా సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డికి సైతం పెళ్ళి పత్రిక ఇస్తాను” తెలిపారు. అంతలోనే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

గతంలో కాంగ్రెస్‌ కీలక నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డిని  బీజేపీలోకి తానే స్వయంగా ఆహ్వానించానని చెబుతూ మహేశ్వర్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మహేశ్వర్ రెడ్డితో విభేదాలుండేవని, ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెప్పారు. కాగా, తనపై తప్పుడు ప్రచారం వెనక బీఆర్ఎస్ ఉందని ధ్వజమెత్తారు.

 వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలో వస్తుందని బాబురావు భరోసా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమదే అధికారమని డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం
కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో  తానుబీజేపీకి రాజీనామా చేసి సొంతగూటికి వెళ్తారని వస్తున్న వార్తలను కాంగ్రెస్ మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తాను బీజీపీకి రాజీనామా చేస్తానని ప్రచారంలో నిజం లేదని, ఆ పార్టీతోనే తన ప్రయాణం అని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. కావాలనే తప్పుడు ప్రచారం చేసి క్యాడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని కార్యకర్తలెవరు నమ్మవద్దని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాను బిజెపి  ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని రాజగోపాల్ కుండబద్దలు కొట్టారు.
ఇటీవల రాజగోపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి తన ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న నేడు విచారణ జరిపింది. రాజగోపాల్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు రాష్ట్ర డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజగోపాల్ రెడ్డికి 2+2 భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. 2 వారాల్లో ఈ భద్రతను కల్పించాలని డీజీపీకి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.