28న ప్రారంభంకు సిద్ధంగా ఉన్న కొత్త పార్లమెంట్ భవనం

కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి తుది మెరుగులు దిద్దడం జరుగుతోందని, ఈ నెలాఖరుకల్లా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

 రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రారంభమైన విషయం తెలిసిందే.  దేశ అధికార కేంద్రమైన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి 9ఏళ్లు పూర్తైన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనం లోనే జరగనున్నాయి. త్రిభుజాకారంలో ఉన్న ఈ పార్లమెంట్‌ను 1224 మంది ఎంపీలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 2014 మే 26న నరేంద్ర మోదీ  ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్‌నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మారాన్ని తిరిగి అభివృద్ధి చేయడం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి నివాసం, కార్యాలయం నిర్మాణం, ఉపరాష్ట్రపతి కొత్త ఎన్‌క్లేవ్ నిర్మాణాన్ని సెంట్రల్ పబ్లిక్ వర్క్ విభాగం అమలు చేస్తున్నది.  అధునిక సదుపాయలు కలిగిన కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు.

రూ.970 కోట్ల వ్యయంతో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో పాత పార్లమెంటు అంత ఎత్తులో ఈ కొత్త భవనాన్ని నిర్మించారు. ఇందులో లోక్ సభ, రాజ్యసభ  కార్యకలాపాల కోసం రెండు పెద్ద హాల్స్ ను నిర్మించారు. అలాగే, ఒక పెద్ద లైబ్రరీని, అత్యాధునిక కాన్స్టిట్యూషన్ హాల్ ను ఏర్పాటు చేశారు. చట్టసభల సభ్యుల కోసం ప్రత్యేక గదులు, పార్లమెంటు కమిటీల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.

 లోక్ సభ కార్యకలాపాల కోసం రూపొందించిన భారీ హాల్లో కనీసం 888 మంది ఎంపీలు కూర్చునే వీలుంది. అలాగే రాజ్యసభ హాళ్లో కనీసం 384 మంది సభ్యులు కూర్చోవచ్చు. లోక్ సభ హాల్ ను నెమలి ఆకృతిలో, రాజ్యసభ హాల్ ను కమలం పువ్వు ఆకృతిలో రూపొందించారు.

 భారత రాజ్యాంగ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా విశాలమైన రాజ్యాంగ హాల్, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, పలు కమిటీ గదులు, డైనింగ్ హాలు, విశాలమైన పార్కింగ్ స్థలం ఇందులో ఉంటాయి. గత ఏడాది నవంబర్‌కే ఈ భవనం వాస్తవానికి పూర్తి కావలసి ఉండింది. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 26 నాటికి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్త పార్లమెంటు భవనాన్ని  ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.  2014 లో తొలిసారి బీజేపీ నాయకత్వంలోని ఈ ఎన్డీయే ప్రభుత్వం మే 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. ఆ తరువాత 2019లో మే 30వ తేదీన రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్సవాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.