సీఎం ఎంపికపై ధిక్కార ధోరణిలో శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అంచనాలకు మించి సీట్లు వచ్చి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కాంగ్రెస్ నాయకత్వం సంకట పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో మల్లగుల్లాలు పడుతున్నది. ఢిల్లీ కేంద్రంగా మూడు రోజులుగా జరుగుతున్న సమాలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు.
 
ఈ పదవికి తీవ్రంగా పోటీ పడుతున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఎవ్వరికీ వారుగా పదవి కోసం పట్టుబడుతూ ఉండడంతో పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేక పోతున్నది.  బలహీన వర్గాలు, దళితుల మద్దతు కూడగట్టడంలో  సిద్దరామయ్య కీలకంగా భావిస్తుండగా; కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పార్టీని విజయం వైపు నడిపించడంలో శివకుమార్ కీలక పాత్ర వహించారు.
 
పైగా, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టును సహితం లెక్కచేయకుండా పార్టీని కర్ణాటకలో నిలబెట్టేందుకు ఎంతో కృషి చేశారు. అయితే కర్ణాటక డిజిపి ప్రవీణ్ సూద్ ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ గా నియామకం జరగడం, బెయిల్ పై ఉన్న శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆ కేసుల దర్యాప్తు వేగం పుంజుకొని లోక్ సభ ఎన్నికల ముందు ఇబ్బందికరంగా ఉండవచ్చని రాహుల్ గాంధీ, ఇతర నేతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది.
 
అందుకనే చేరి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సిద్దరామయ్య తదితరులు ప్రతిపాదిస్తున్న శివకుమార్ అందుకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ లలో కూడా ఇదేవిధమైన ఒప్పందాలతో ముఖ్యమంత్రులను ఎంపిక చేసి, ఆ తర్వాత ముఖ్యమంత్రులు రాజీనామా చేసేందుకు నిరాకరిస్తే పార్టీ అధిష్టానం ఏమీ చేయలేక పోయిందని గుర్తు చేస్తున్నారు.
 
ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన మంత్రిత్వ శాఖలు, కేపీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇస్తామన్నా శివకుమార్ ఒప్పుకోవడం లేదు. తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా ఉండనీయండని అంటూ మల్లికర్జున ఖర్గేతో  అన్నట్లు తెలుస్తున్నది.   ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో అసలు ఏ మంత్రి పదవి వద్దని, ఒక ఎమ్యెల్యేగా ఉంటానని స్పష్టం చేస్తున్నారు.  ఈ సందర్భంగా సిద్దరామయ్యపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తనను కానీ పక్షంలో సిద్దరామయ్యను కూడా ముఖ్యమంత్రిగా చేయవద్దని తేల్చి చెబుతున్నారు.
 
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీయే తనకు కన్నతల్లి అని, పార్టీని తాము నిర్మించామని, పార్టీకి వెన్నుపోటు పొడవనని, బ్లాక్ మెయిల్ చేయనని అంటూనే ధిక్కారధోరణి ప్రదర్శిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో సిద్దరామయ్య సారథ్యంలోనే కర్ణాటకలో పార్టీ దెబ్బతిన్నదని, జేడీఎస్ తో కలసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం సిద్దరామయ్య సారథ్యంలోనే కూలిపోయిందని గుర్తు చేస్తున్నారు.
 
గతంలో జేడీఎస్ నేతగా ఉన్నప్పుడు హెచ్ డి కుమారస్వామితో ఉన్న వ్యతిరేకత కారణంగా, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండటం తట్టుకోలేక ప్రభుత్వాన్ని బిజెపి కూల్చేందుకు సహకరించారని అంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అందరూ సిద్దరామయ్య అనుచరులే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
 
 “మీకు సొంత కుమారుడు కావాలా? దత్తపుత్రుడు కావాలా?” తేల్చుకోండి అంటూ పార్టీ అధిష్ఠానంను సవాల్ చేసేరీతిలో  మాట్లాడుతూ ఉండడంతో పార్టీ నాయకత్వంపై దిక్కుతోచడం లేదు. అదేవిధంగా సిద్ధూపై రాష్ట్రంలోని ప్రధానవర్గమైన లింగాయత్‌లు వ్యతిరేకంగా ఉన్నారని డీకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

కర్ణాటక సీఎం ఎంపిక ఆలస్యం అయ్యే కొద్దీ ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతున్నది. తమ నాయకుడిని సీఎం చేయాలంటూ మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మంగళవారం తుమకూరులో భారీ ర్యాలీ చేపట్టారు. ‘దళితుడిని సీఎం చేయాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు.

 ‘నేనూ 50 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లి బలప్రదర్శన చేయగలను. కానీ అలా చేయడం తగదు’ అని పరమేశ్వర చెప్పారు. మరోవైపు లింగాయత్‌ కమ్యూనిటీ నుంచి 34 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారని, వారిలో ఒకరిని సీఎంను చేయాలని ఆలిండియా వీరశైవ మహాసభ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి లేఖ రాసింది. సిద్ధరామయ్య, డీకేల్లోనే ఒకరిని ఎంపిక చేయలేకపోతుంటే ఇప్పుడు కొత్త డిమాండ్లు రావడంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ తల పట్టుకొంటున్నది. ముస్లింలు, ఈడిగలు డిప్యూటీ సీఎం పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు