నితీష్ ఎప్పటికి ప్రధాని కాలేరు

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి కావాలని నితీష్ కుమార్ ఇప్పటి నుంచే కలలు కంటున్నారని, అయితే అది ఎప్పటికీ సాధ్యం కాదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ ఈ దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అవుతారని తేల్చి చెప్పారు.
 
శ్రీ రామ నవమి సందర్భంగా అల్లర్లు జరిగిన బీహార్ లో రెండో రోజు నవడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.  కాబోయే ప్రధాని ఎవరనే విషయాన్ని ఇప్పటికే దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన వెల్లడించారు. బిహార్‌లోని అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో కమలం వికసిస్తుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు.
 
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో మళ్లీ చేరుతామంటూ నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) నాయకులు తమకు సంకేతాలను పంపిస్తోన్నారని అమిత్ షా వెల్లడించారు. అయితే,  ఎన్డీఏలో చేరికకు జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని ఆయన తేల్చి చెప్పారు.
 
2024 ఎన్నికల తర్వాత బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బిహార్ లో జంగిల్ రాజ్ నడుస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిహార్‌లో శాంతి స్థాపన కుదురుతుందా? అని ప్రశ్నించారు.
 
నితీష్ కుమార్ అధికార దాహంతోనే రాష్ట్రీయ జనతాదళ్‌తో పొత్తు కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ మహాకూటమి ప్రభుత్వాన్ని తాము ఓడించి తీరుతామని అమిత్ షా వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు.
 
శాంతి భధ్రతలను నెలకొల్పే విషయంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చించి ఏ మాత్రం ఉపయోగం లేదని అమిత్ షా విమర్శించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దించుతున్నామని వెల్లడించారు. అల్లర్లు చెలరేగిన ససారం పట్టణానికి తాను వెళ్లాల్సి ఉన్నప్పటికీ దురదృష్టకర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయని, పోలీసులు ప్రజలపై టియర్ గ్యాస్‌, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తోన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.