కేసీఆర్ కు మింగుడు పడని కర్ణాటక ఫలితాలు

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు మింగుడు పడటం లేదు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి, జాతీయ రాజకీయాలలో తన ప్రతాపం చూపుతానని ప్రకటించిన కేసీఆర్ మొదటగా కర్ణాటక వైపే దృష్టి సారించారు.
 
పైగా, అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జేడీఎస్ తో కలిసి పోటీచేస్తున్నామని చెప్పడమే కాకుండా ఉమ్మడిగా ప్రచారం చేస్తామని కూడా వెల్లడించారు. అయితే, తీరా ఎన్నికలు వచ్చేసరికి అటువైపే చూడలేదు. పోటీచేయకపోగా మిత్రపక్షం అని చెప్పిన జేడీఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేయలేదు. కనీసం జేడీఎస్ ను గెలిపించమని, బిజెపి, కాంగ్రెస్ లను ఓడించమని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసే ధైర్యం కూడా చేయలేదు.
 
కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను ముందే గ్రహించి అక్కడ పోటీ చేసినా లేదా జేడీఎస్ కు మద్దతు ఇచ్చినా నిండా మునిగిపోతామని గుర్తించి వెనుకడుగు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకొంటే కేసీఆర్ లో మరింతగా వణుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కర్ణాటకలో బిజెపిపై కన్నా తెలంగాణాలో బిఆర్ఎస్ పై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో కలవరం చెందుతున్నట్లు చెబుతున్నారు.
 
కర్ణాటకలో బిజెపి ఓటమి చెందినా ప్రజాదరణ మాత్రం తగ్గలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపుగా గత ఎన్నికల్లో లభించిన ఓట్లే లభించాయి. అయితే జేడీఎస్ బాగా బలహీనపడటం, ఆ పార్టీ నుండి 5 శాతం ఓట్లు కాంగ్రెస్ వైపు తిరగడం ఒక వంక, మరోవంక బళ్లారి ప్రాంతంలో గాలి జనార్ధనరెడ్డి కొత్త పార్టీ ప్రారంభించి, అభ్యర్థులను నిలబెట్టడం ప్రధానంగా బీజేపీకి ప్రతికూలంగా మారింది.
 
కానీ, తెలంగాణాలో పరిస్థితులు అంతకన్నా భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపితే బిఆర్ఎస్ గణనీయంగా ఓట్లు, సీట్లు కోల్పోవడం అనివార్యం కాగలదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తెలంగాణాలో ఆ పార్టీ ప్రభావం కొద్దీ జిల్లాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలో బిజెపి బలీయమైన రాజకీయ శక్తిగా కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి.
 
తెలంగాణలో కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ ప్రభుత్వ వ్యతిరేకతను ఆసరా చేసుకొని బిఆర్ఎస్ ఓటర్లను చీల్చి, ప్రయోజనం పొందాలి గాని కాంగ్రెస్ – బీజేపీ ఓట్లు ఒక పార్టీ నుండి, మరో పార్టీకి మారే అవకాశం లేదు. కర్ణాటకలో సహితం ఎక్కడా ఆ విధంగా మారలేదు. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ కు మారడంతో కుమారస్వామి ఆశించిన విధంగా `కింగ్ మేకర్’ కాలేకపోయారు.
 
తెలంగాణాలో అదే విధంగా బిఆర్ఎస్ ఓట్లు కేవలం కాంగ్రెస్ మాత్రమే కాకుండా, అంతకన్నా ఎక్కువగా బీజేపీకి సహితం బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే రెండు విధాలుగా నష్టపోతామని బిఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో ప్రతిపక్షాలు అవినీతి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి అధికారంలో ఉన్న బిజెపికి  గల ప్రజాదరణకు గండికొట్టే ప్రయత్నాలు చేశారు.
 
తెలంగాణాలో అయితే కేసీఆర్ కుటుంభం సభ్యులే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్యెల్సీ కవిత తీవ్రమైన ఇబ్బందులలో చిక్కుకున్నారు. ఈడీ, సీబీఐ పలు ఛార్జ్ షీట్ లలో ఆమె ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఎప్పుడు ఏమి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
 
ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు, పథకాలలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధరణి పేరుతో భూముల దురాక్రమణకు ద్వారాలు తెరిచారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులు సమకూరుస్తామని స్వయంగా కేసీఆర్ భరోసా ఇస్తున్నారనే వార్త ఆకధనం వెలువడింది అంటే దేశం మొత్తం మీద అవినీతిలో కేసీఆర్ కు మరే ముఖ్యమంత్రి పోటీకి రాలేరని స్పష్టం అవుతుంది.
 
ఇప్పటికే ప్రభుత్వ అవినీతి గురించి సాధారణ ప్రజలలో సహితం చర్చలు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్రమైన అసహనం ఈ ప్రభుత్వం పట్ల వెళ్ళడవుతుంది. సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం, వేతన సవరణలు సకాలంలో జరపకపోవడం, తాత్కాలిక ఉద్యోగులను పెర్మనెంట్ చేయకపోవడం వంటి సమస్యల కారణంగా వారంతా ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయి.
 
మరోవంక, ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరపకపోవడం, ఉద్యోగ ఎంపిక పరీక్షలో సహితం పేపర్ లీక్ అంటూ భారీ కుంభకోణాలు చోటుచేసుకోవడంతో యువత ప్రభుత్వం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు అన్ని దాదాపు అన్ని వర్గాల ప్రజలు వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పై మూకుమ్మడిగా దాడి జరిపే పరిస్థితులు నెలకొన్నట్లు వెల్లడి అవుతుంది. అందుకనే కర్ణాటక ఫలితాలు బిఆర్ఎస్ నేతలలో కలవరం కలిగిస్తున్నాయి.