లోకేష్ ముందే రెచ్చిపోయిన భూమా, సుబ్బారెడ్డి వర్గాలు

* భూమా అఖిల ప్రియా అరెస్ట్
నంద్యాల జిల్లా టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమంటున్నాయి. టిడిపి ప్రధాన కార్యదర్శి  వంద రోజులుగా జరుపుతున్న `యువగళం’ పాదయాత్ర సందర్భంగా నంద్యాల టిడిపిలో రెండు వర్గాలు నడిరోడ్డు మీదనే ముష్టి యుద్ధాలకు దిగాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు పరస్పరం దాడులకు దిగారు. నడిరోడ్డు మీద కొట్టుకున్నారు.

జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది.  టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి చేయడంపై ఏవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానితో భూమా అఖిల ప్రియను బుధవారం పోలీసులు అరెస్టు చేసి నంద్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎవి సుబ్బారెడ్డిపై తన అనుచరులతో దాడి చేయించారని అఖిల ప్రియపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అఖిలప్రియతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు. తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్ మధ్య తొలుత మాటలయుద్ధం చోటు చేసుకుంది. నడిరోడ్డు మీదే వారు ఘాటు పదాలతో రెచ్చిపోయారు. పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో భూమా అఖిలప్రియ వర్గీయులు తొడగొట్టి సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు. ఏవీ సుబ్బారెడ్డిని చుట్టుముట్టి రక్తం కారేలా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు.
ఆయనను రోడ్డు మీదికి తోసిపడేశారు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది.  వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు.
భూమా వర్గీయులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ..వారు ఏ మాత్రం లెక్కచేయలేదు. ఏవీ వర్గీయులను తరిమి కొట్టారు.  నోటి నుంచి రక్తం కారుతున్న స్థితిలో కనిపించిన ఏవీ సుబ్బారెడ్డిని ఆయన వర్గీయులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు అరగంట పాటు కొత్తపల్లి నడిరోడ్డు మీద ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల డీఎస్పీ సీ మహేశ్వర్ రెడ్డి.. ఆసుపత్రికి వెళ్లి ఏవీ సుబ్బారెడ్డిని పరామర్శించారు.
 
భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు. భూమా దంపతుల మరణం తరువాత ఏవీ సుబ్బారెడ్డి- అఖిలప్రియ మధ్య విభేదాలు తలెత్తాయి. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలపై ఆధిపత్యం చలయించడానికి ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నించడమే దీనికి కారణం. ఆళ్లగడ్డ లేదా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నిస్తుండడంతో ఇప్పుడున్న భూమా కుటుంబంతో విభేదాలు తలెత్తాయి.