`సుప్రీం’ న్యాయమూర్తిగా ఏపీ ప్రధాన న్యాయమూర్తి మిశ్రా

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు మే 16న సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో తీర్మానాన్ని అప్‌లోడ్ చేసింది.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అక్టోబర్ 13, 2021న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు ప్రాతినిథ్యం లేదని అందుకే జస్టిస్ మిశ్రాను పేరు సిఫార్సు చేసినట్లు తెలిపింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యంతో పాటు, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అనుభవం, వృత్తిపర నైపుణ్యం సుప్రీంకోర్టు జస్టిస్ పదవికి అదనపు విలువను అందిస్తుందని కొలీజియం భావించింది.

అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రితింకర్ దివాకర్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి డ్రా చేసి జస్టిస్ మిశ్రా కంటే సీనియర్ ర్యాంక్ ఇచ్చిన విషయాన్ని కూడా కొలీజియం ప్రస్తావించింది. అయితే అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జస్టిస్ మిశ్రాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అర్హులని అభిప్రాయపడింది.

 సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండవలసి ఉండగా, ప్రస్తుతం 32 మందే  పనిచేస్తున్నారు. అలాగే జులై రెండో వారం నాటికి మరో నాలుగు ఖాళీలు ఏర్పడనున్నాయి. దీంతో న్యాయమూర్తుల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరుకుంటుంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ పేరును కూడా కొలీజియం సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌లు ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌, అజయ్‌ రస్తోగి, సంజీవ్‌ ఖన్నాలతో కూడిన కొలీజియం సుప్రీంకోర్టు బెంచ్‌లో నేరుగా నియమించిన న్యాయమూర్తులు ఒక్కరే ఉన్నారని అభిప్రాయపడింది.

విశ్వనాథన్‌ను నియమించడం వల్ల ఆయన సుప్రీంకోర్టులో బార్‌కు ప్రాతినిధ్యం పెరుగుతుందని కొలీజియం అభిప్రాయపడింది. విశ్వనాథన్ విస్తృత అనుభవం సుప్రీంకోర్టుకు గణనీయమైన విలువను అందిస్తాయని కొలీజియం తీర్మానంలో పేర్కొంది.

విశ్వనాథన్ మే 16, 1966న జన్మించారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత, మే 25, 2031 వరకు ఆ హోదాలో కొనసాగుతారు. జస్టిస్ జెబి పార్దివాలా ఆగస్టు 11, 2030న పదవీ విరమణ చేసిన తర్వాత, విశ్వనాథన్ మే 25, 2031న పదవీ విరమణ చేసే వరకు భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టేందుకు తదుపరి వరుసలో ఉంటారు.

ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు నియమించబడే న్యాయవాదుల జాబితాలో సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ పదో వ్యక్తిగా ఉంటారు.