దేశంలో 18 నెలల కనిష్టానికి ద్రవ్యోల్భణం

ధరల పెరుగుదల కర్ణాటక పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన సమయంలో ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ 18 నెలల తర్వాత (2021 అక్టోబర్ తర్వాత) కనిష్ట స్థాయిలో 4.7 శాతానికి తగ్గడం ఉపశమనం కలిగిస్తుంది.  ఆహారోత్పత్తుల ధరలు మరింత దిగిరావడం ఇందుకు దోహదపడింది.

 జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎసఓ) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం  గతనెలకు ఆహారోత్పత్తుల ధరల వార్షిక పెరుగుదల 3.84 శాతానికి పరిమితమైంది. కాగా ఈ మార్చిలో 4.79 శాతంగా, 2022 ఏప్రిల్‌లో 8.31 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2022-23) రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటు 5.2 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి మించకుండా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది. సూచీ ఈ స్థాయికి దిగువన నమోదు కావడం వరుసగా ఇది రెండో నెల. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరికొంత కాలం యథాతథంగానే కొనసాగించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది మే నుంచి రెపో రేటును 2.50 శాతం పెంచిన ఆర్‌బీఐ గత సమీక్షలో వరుస వడ్డింపునకు విరామం ప్రకటించింది. 6.50 శాతంగా ఉన్న రెపోను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ తదుపరి సమీక నిర్ణయాలను జూన్‌ 8న ప్రకటించనుంది. అయితే, దేశంలో పారిశ్రామికోత్పత్తి 5 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 1.1 శాతానికి జారుకుంది. వస్తు తయారీ రంగం పేలవ పనితీరు ఇందుకు కారణమైంది.

ఎన్‌ఎసఓ డేటా ప్రకార మార్చిలో మాన్యుఫాక్చరింగ్‌ రంగ ఉత్పత్తి వార్షిక వఅద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. మైనింగ్‌ ఉత్పత్తి 6.8 శాతం పెరగగా.. విద్యుత్‌ ఉత్పత్తి 1.6 శాతం క్షీణించింది. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరం(2022-23) మొత్తానికి ఐఐపీ 5.1 శాతంగా నమోదైంది. 2021-22లో 11.4 శాతంగా ఉంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి అంచనాల కంటే బాగా తగ్గడం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)పై ప్రభావం చూపనుందని ఆర్థిక విశ్లేషకులంటున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంతోపాటు 2022-23 ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలను కేంద్రం ఈనెల 31న విడుదల చేయనుంది.

గతనెలలో ద్రవ్యోల్బణం 4.7 శాతానికి దిగిరావడం చాలా సంతోషకరమని ఆర్‌ఐబీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. తాజా గణాంకాలు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానం సరైన పథంలోనే కొనసాగుంతోదన్న నమ్మకాన్నిచ్చాయని ఆయన చెప్పారు. అయితే, మున్ముందు సమీక్షల్లో ద్రవ్యపరపతి విధాన వైఖరిలో మార్పుంటుందా? అన్న విషయంపై వ్యాఖ్యానించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

జీ-20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ రచించిన పుస్తకం ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ విడుదల కార్యక్రమంలో పాల్గన్న సందర్భంగా దాస్‌ మాట్లాడుతూ ఇతర విశ్లేషకులు అంత ఆశావహంగా లేకపోయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం(2023-24)లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదుకాగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ జీడీపీ 6.5 శాతంగా నమోదైతే, ప్రపంచ వృద్ధిలో  భారత్‌ వాటా 15 శాతంగా ఉండనుందని చెప్పారు.