నేడే జగిత్యాల బంద్ కు వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ పిలుపు

జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్‌ ఎస్సై అనిల్‌ సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రం బంద్‌కు విశ్వహిందూ పరిషత్‌   భజరంగ్‌దళ్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులో బలహీన వర్గానికి చెందిన ఒక హిందూ మహిళ మీద దాడి చేసి, దానికి మతం రంగు పులుముతూ, ఆ మహిళ భర్త అయిన ఎస్సై మీద ఎంఐఎం పార్టీ కక్ష సాధింపులకు నిరసనగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వారు ప్రకటించారు.

ఆర్టీసీ బస్సులో జరిగిన ఘటనలో ఒక వర్గం వారి ఆరోపణలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని బస్సు డ్రైవర్‌, కండక్టర్‌, తోటి ప్రయాణికులను విచారించకుండా ఒక వర్గం వారి ఒత్తిళ్లకు, ఎంఐఎం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు బయపడి ఎస్సైని సస్పెండ్‌ చేయడం తగదని హితవు చెప్పారు. వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ జగిత్యాల శాఖ నాయకులు బంద్ కు పిలుపిచ్చారు.

ఎస్ఐ సస్పెన్షన్ పట్ల తీవ్ర అభ్యంతరమా వ్యక్తం చేస్తూ భార్య ఆత్మ గౌరవం కాపాడుకోలేని పోలీసులకు రివాల్వర్, ఖాకీ డ్రెస్ ఎందుకని బిజెపి ఎంపీ డి అరవింద్ ప్రశ్నించారు. బస్సులో ఉన్న యువతిని ఎస్ఐ భార్య ఏమీ అనలేదని, కేవలం బుర్కా వేసుకున్న యువతి ఫిర్యాదు ఇస్తే ఆగ మేఘాల మీద స్పందిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేయడం సభ్యసమాజం తలదించుకునే ఘటన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ మండిపడ్డారు.  ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడం దారుణమని ధ్వజమెత్తారు.

ఎస్సై అనిల్, ఆయన భార్య చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అనిల్ ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎస్సై దాడి చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఏ ఆధారాలతో ఎస్సైని సస్పెండ్ చేశారో  చెప్పాలని నిలిదీశారు.  మానవత్వం లేకుండా ఎస్సైని సస్పెండ్  చేయడమే గాకుండా న్యూసెన్స్ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. 

పోలీస్ స్టేషన్ పై దాడికి వచ్చిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని సంజయ్ ప్రశ్నించారు.  ఓ భర్తగా ఎస్సై తన భార్యను కాపాడుకోవడానికి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.