ఝాన్సీపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి

తనపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ చేశారు. శ్రీనిధి, గురునానక్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఉన్నత విద్యామండలిలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే పోలీసులు తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు.
 
పోలీసులు అరెస్ట్ ​చేసే క్రమంలో గాయపడిన ఝాన్సీ దిల్​సుఖ్​నగర్​లోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతుంది. శుక్రవారం ఆమె హాస్పిటల్​లో మీడియాతో మాట్లాడుతూ మహిళలు అని చూడకుండా పోలీసులు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.  సీసీ కెమెరా లేని రూమ్ లోకి తీసుకెళ్లి మహిళా పోలీసులు తనను చితకబాదారని ఆమె ఆరోపించారు.
ఆ బాధతోనే పోలీసులపై చేయిచేసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఆత్మ రక్షణ కోసం ప్రతిఘటించామే తప్ప వేరే ఉద్దే శం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఝాన్సీని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్​రావు, కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు.కాగా, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడి చేసిన హుమాయూన్ నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం లక్డీకాపూల్ డీజీపీ ఆఫీస్‌లో మాజీ ఎమ్యెల్సీ రామచందర్ రావుతో కలిసి డీజీపీ అంజనీ కుమార్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు.