కర్ణాటకలో ఓటమిని అంగీకరించిన బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు బీజేపీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై తెలిపారు. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయామని శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ లక్ష్యాలను చేరుకోలేకపోయిందని బొమ్మై పేర్కొన్నారు.
 
2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకెళ్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బొమ్మై ఈ ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ఇతర నేతలు, కార్యకర్తలు అందరం సమిష్టిగా కృషిచేసినా కావాల్సిన మార్క్‌ సాధించలేకపోయామని చెప్పారు.
 

పూర్తిగా ఫలితాలు వెల్లడైన తరువాత పూర్తి స్థాయిలో ఆత్మ విమర్శ చేసుకుంటామని చెప్పారు. ఫలితాలపై సంపూర్థ విశ్లేషణ చేసి, తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపారు. ‘‘ఒక జాతీయ పార్టీగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఈ ఎన్నికల్లో గెలుపు, ఓటములకు సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష జరుపుతాం. వివిధ స్థాయిల్లో ఏయే విషయాల్లో దెబ్బతిన్నామనే విషయాన్ని విశ్లేషిస్తాం’’ అని వివరించారు.

ఈ ఎన్నికల ఫలితాలను పార్టీ అంగీకరిస్తోంది. పొరపాట్లను, తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకుని రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతామని బొమ్మై స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీలోని లోటుపాట్లను సరిదిద్ధి, పార్టీని మళ్లీ రీ ఆర్గనైజ్ చేసి, రానున్న లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒక గుణపాఠంగా స్వీకరిస్తామని చెప్పారు.

కాగా, షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బసవరాజ్ బొమ్మై  కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ పై  20,000 ఓట్లకు పైగా గెలుపొందారు. బొమ్మైకి 59,242 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పఠాన్‌కు 37,723 ఓట్లు వచ్చాయి. 

గెలుపు, ఓటములు బిజెపికి కొత్త కాదు

బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప పార్టీ ఓటమిని అంగీకరిస్తూ గెలుపు, ఓటములు బిజెపికి కొత్త కాదని చెప్పారు. రెండు స్థానాలతో ప్రారంభమైన బిజెపి ప్రస్థానం… రాష్ట్రంలో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయి వరకు కొనసాగిందని చెప్పారు.
 
ఈ ఎన్నికల ఫలితాలతో పార్టీ వర్కర్లు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో పరాజయంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.