కర్ణాటకలో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌‌కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి కర్ణాటకలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో విజయం సాధించింది. పలు పోల్ సర్వేల అంచనాలకు మించి విజయం సాధించింది.  కర్ణాటక నుండి దక్షిణాదిన విస్తరించేందుకు ప్రయత్నం చేస్తున్న  బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. 
బీజేపీ మంత్రుల్లో చాలా మంది పరాజితుల జాబితాలో చేరిపోయారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారు. 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 65, కాంగ్రెస్ 136, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు.

కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రెవిన్యూ మంత్రి ఆర్. అశోక్‌పై సుమారు 1 లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మయ్ షిగ్గాన్ నియోజకవర్గం నుంచి 36 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విజయం సాధించారు.

మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ నేత జగదీశ్ షెట్టార్ హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఆయన ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి మహేశ్ టెంగినకాయ్ 30 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

చన్నపట్న నియోజకవర్గంలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి విజయం సాధించారు. అయితే ఆయన కుమారుడు నిఖిల్ కుమార స్వామి రామనగర నియోజకవర్గంలో పరాజయాన్ని చవి చూశారు. కర్ణాటక ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మళ్లీ ‘కింగ్ మేకర్’ కావాలనుకున్న జేడీఎస్ ఆశలు గల్లగంతయ్యాయి. పైగా, ఆ పార్టీ బలం సగం మేరకు తగ్గింది.

మోదీ అభినందనలు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. కర్ణాటక బరిలో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ ల హోరాహోరీ పోరులో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. రానున్న కాలంలో మరింత ఉత్సాహంగా కర్ణాటకకు సేవ చేస్తామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో పార్టీ విజయం కోసం ప్రధాని మోదీ చేసిన కృషి ఫలించలేదు. 

బిజెపి ఓటు శాతంలో మాత్రం మార్పు లేదు. అయితే జేడీఎస్ ఓటు శాతం ఐదుశాతం మేరకు తగ్గగా, ఆ మేరకు కాంగ్రెస్ ఓటు శాతం పెరిగింది. ముఖ్యంగా జేడీఎస్ కు బలమైన పాత మైసూర్ ప్రాంతంలో ఆ పార్టీ బాగా దెబ్బతినడంతో, అక్కడ కాంగ్రెస్ ఎక్కువగా సీట్లు గెలుపొందడం ఆ పార్టీకి కలిసి వచ్చింది.

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్యంతో శికారిపుర నియోజకవర్గంలో విజయం సాధించారు. బీజేపీ మంత్రులు బీసీ పాటిల్, గోవింద కరజోల, డాక్టర్ కే సుధాకర్, ఎంటీబీ నాగరాజు, బీ శ్రీరాములు, నారాయణ గౌడ, మురుగేశ్ నిరానీ ఓటమిపాలయ్యారు.

ప్రేమ గెలిచిందని రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ద్వేషాన్ని కాదని కర్ణాటక ప్రజలు ప్రేమను ఎంచుకున్నారని చెబుతూ ఇది కర్ణాటక ప్రజల విజయమని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పార్టీ మెజారిటీ మార్కును దాటి ఆధిక్యత సాధించడంతో కాంగ్రెస్ శాసనసభా పక్ష  సమావేశం ఆదివారం ఉదయం బెంగళూరులో జరగనుంది.
 
గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా,  సీఎంగా ప్రమాణం చేసిన మూడు రోజులకే యడియూరప్ప రాజీనామా చేశారు. అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ఇది 14 నెలలకే కూలిపోయింది. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీతో చేతులు కలపడంతో, తదనంతర పరిణామాలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.