యూపీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. యూపీలో ఉన్న మొత్తం 199 మున్సిపల్ కౌన్సిల్స్ లో98 కౌన్సల్స్ లో బీజేపీ విజయం సాధించింది. కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చిన షాజహాన్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీజేపీనే గెలిచింది.

ఉత్తర ప్రదేశ్ లోని మొత్తం 199 మున్సిపల్ కౌన్సిల్స్ లో 98 కౌన్సల్స్ లో బీజేపీ, 34 కౌన్సిల్స్ లో సమాజ్ వాదీ పార్టీ, 15 కౌన్సిల్స్ లో బీఎస్పీ, నాలుగు కౌన్సిల్స్ లో కాంగ్రెస్, సుమారు 45 కౌన్సిల్స్ లో ఇతరులు విజయం సాధించారు. అలాగే, రాష్ట్రంలోని 544 నగర పాలికల్లో 199 నగర పాలికల్లో బీజేపీ విజయం సాధించింది. 93 నగర పాలికల్లో సమాజ్ వాదీ పార్టీ, 41 నగర పాలికల్లో బీఎస్పీ, 11 నగర పాలికల్లో కాంగ్రెస్, 200 నగర పాలికల్లో ఇతరులు విజయం సాధించారు.

మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై బీజేపీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో సమర్ధవంతమైన పరిపాలన, అభివృద్ధి, భద్రత కారణంగానే మునిసిపల్ఎన్నికల్లో గెలుపు లభించిందని ఆదిత్యనాథ్ తెలిపారు. ‘2017లో బిజెపి 60 సీట్లు గెలుపొందగా, ఈ ఏడాది పట్టణ స్థానిక ఎన్నికల్లో రెట్టింపు సీట్లు సాధించాం’ అని పేర్కొన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మే 4, మే 11 తేదీల్లో రెండు దశల్లో జరిగాయి.

కాగా, ఉత్తర ప్రదేశ్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా శనివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్ర పక్షం అప్నా దళ్ విజయం సాధించింది. సువార్, చాంబే అసెంబ్లీ స్థానాల్లో సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులపై అప్నా దళ్ అభ్యర్థులు గెలుపొందారు.

‘మా మిత్రపక్షం అప్నా దళ్(సోనేలాల్) సువార్, చన్బే ఉప ఎన్నికలు రెండింటిలోనూ విజయం సాధించి సమాజ్ వాదీ పార్టీని ఓడించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యుపి ప్రభుత్వం వారి అభివృద్ధి, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను’ అని యోగి భరోసా ఇచ్చారు.