భవిష్యత్ తరాలను తీర్చదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకం

తనను తాను జీవితకాల విద్యార్థిగా భావిస్తున్నానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకం అని తెలిపారు. శుక్రవారం గుజరాత్‌‌‌‌లోని గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లో ఆలిండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ బైయాన్యువల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌‌‌‌లో మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు.
 
భూటాన్, సౌదీ అరేబియా అధినేతలు కూడా భారతీయ ఉపాధ్యాయులే తమ దేశంలో విద్యాబోధన విషయంలో కీలక వ్యవహరిస్తున్నారని చెప్పారని పేర్కొంటూ డబ్ల్యుహెచ్ఐ చీఫ్ టెడ్రోస్ గ్రాబ్రేసియస్ కూడా మన ఉపాధ్యాయుల గురించి గొప్పగా చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. భారతీయ ఉపాధ్యాయులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, ప్రజలు తరతరాలుగా వారిని గు ర్తుంచుకుంటారని తెలిపారు.

సమాజంలో ఏం జరిగినా నిశితంగా అధ్యయనం చేయాలని సూచిస్తూ  21వ శతాబ్దపు శరవేగంగా మారుతున్న కాలంలో, భారతదేశ విద్యా విధానం మారుతోందని, ఉపాధ్యాయులు మారుతున్నారని, విద్యార్థులు కూడా మారుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మారుతున్న ఈ పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళతామనేది ముఖ్యమని చెప్పారు.

ఇంతకుముందు ఉపాధ్యాయులకు వనరుల కొరత, మౌలిక సదుపాయాలు వంటి సవాళ్లు ఉన్నాయని, విద్యార్థుల నుండి ప్రత్యేక సవాలు లేదని చెప్పారు. అయితే, నేడు వనరులు,  మౌలిక సదుపాయాల సమస్య అధిగమించబడుతుందని, కానీ నేటి విద్యార్థుల ఉత్సుకత ఉపాధ్యాయులకు సవాలుగా మారుతోందని ప్రధాని వారించారు.

ఎందుకంటే వారు తమ పుస్తకాలను నేర్చుకోవడానికి,  అర్థం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారని చెబుతూ ఇక్కడ కూర్చున్న ఉపాధ్యాయులు ప్రతిరోజూ దీనిని అనుభవిస్తూ ఉండొచ్చని తెలిపారు. విద్యతో పాటు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని ఉపాధ్యాయులను ప్రధాని మోదీ కోరారు.

మీరు గూగుల్ నుండి డేటాను పొందవచ్చని.. కానీ ఆ విషయం మీరే నిర్ణయించుకోవాలని చెప్పారు. గురువు తన సమాచారాన్ని ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో గురువు మాత్రమే మార్గనిర్దేశం చేయగలడని పేర్కొన్నారు. సాంకేతికత సమాచారాన్ని అందించగలదు కానీ ఉపాధ్యాయుడు మాత్రమే సరైన దృక్పథాన్ని చూపగలడని ప్రధాని స్పష్టం చేశారు.

ఏ సమాచారం ఉపయోగపడుతుందో, ఏది కాదో గురువుకు మాత్రమే చక్కగా చెప్పగలడని అంటూ  దీనితో పాటు ఒక టీచర్ తన పిల్లలకు మంచి టీచర్ కావాలని కోరుకున్నట్లే, ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలకు మంచి టీచర్ కావాలని కోరుకుంటారని ప్రధాని గుర్తు చేశారు. వారి ఆలోచనలు, చర్యలు, మాటలు, ప్రవర్తన నుండి విద్యార్థి చాలా నేర్చుకుంటాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు.

విద్యార్థి కఠినంగా ఉన్నప్పుడు మృదువుగా ఎలా ఉండాలో గురువు నుండి నేర్చుకుంటాడని చెబుతూ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ తెలిపారు. ఉపాధ్యాయుడు అంటే విద్యార్థి కుటుంబం కంటే ఎక్కువ సమయం గడిపే వ్యక్తి అని.. కాబట్టి మీ అందరిలో ఉన్న ఈ బాధ్యత భావం రాబోయే భారత తరాలను బలోపేతం చేస్తుందని గుర్తు చేశారు.

గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లో రూ.4,400 కోట్ల ప్రాజెక్టుల్లో కొన్నింటికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని దేశానికి అంకితం చేశారు. ‘గృహ ప్రవేశ్’ స్కీమ్‌‌‌‌ కింద నిర్మించిన 19 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.