నిషిద్ధ పిఎఫ్‌ఐ, ఉగ్ర శిబిరాలపై ఎన్‌ఐఎ దాడులు

తమిళనాడులలోని నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)కు చెందిన కేంద్రాలపై, జజమ్మూ కశ్మీరులో ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మంగళవారం దాడులు చేపట్టింది. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పన్నిన కుట్రలో భాగంగా యువతకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చేందుకు పిఎఫ్‌ఐకు చెందిన కేంద్రాలు శిక్షణా శిబిరాలను నడుపుతున్న ట్లు ఎన్‌ఐఎ అనుమానిస్తోంది.

తమిళనాడులోని చెన్నై, ముదరై, దిండిగల్, తేని, తిరువటియూర్, తిరుచ్చితోసహా 10 చోట్ల ఎన్‌ఐఎ దాడులు జరిపింది. నిషిద్ధ పిఎఫ్‌ఐకి చెందిన మదురై ప్రాంత అధ్యక్షుడు మొహమ్మద్ ఖాసియర్‌ను కూడా ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డిపిఐ) కార్యాలయాలపై కూడా ఎన్‌ఐఎ దాడులు జరిపినట్లు వర్గాలు తెలిపాయి.

మరోవంక, జమ్మూకశ్మీరులో ఉగ్రవాద కుట్ర కేసులో ఎన్ఐఏ మంగళవారం దాడులు చేసింది. శ్రీనగర్, కుప్వారా, పూంచ్, రాజౌరితో సహా జమ్మూకశ్మీరులోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరిపింది. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేర నకిలీ పేర్లతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు.

ఏప్రిల్ 20వతేదీన పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. భింబర్ గలీ నుంచి సాంగ్యోట్ కు ఆర్మీ వాహనం వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి.

ఉగ్రవాదులు పాకిస్థాన్ సైన్యం వద్ద కమాండో శిక్షణ పొందుతున్నారని ఈ  దాడుల్లో వెల్లడైంది. ఉగ్రవాద శిక్షణకు నిధుల సమీకరణకు సంబంధించి జమ్మూ కశ్మీరులోని 15 ప్రదేశాలలో ఎన్‌ఐఎ దాడులు నిర్వహిసున్నట్లు వర్గాలు తెలిపాయి.