జూన్ 8న జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణ

జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఛైర్మన్ పరిశీలించారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించిందని, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు.
ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ – కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు శ్రీ బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని పేర్కొన్నారు.
 
ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాల నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.
 
ఇటీవల చెన్నై, విశాఖపట్నం భువనేశ్వర్, అమరావతి తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామని పేర్కొన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అహ్మదాబాద్, రాయపూర్ లలో కూడా స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని సుబ్బారెడ్డి వివరించారు.