ది కేరళ స్టోరీకి కలెక్షన్ల సునామీ

ది కేరళ స్టోరీ కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. తొలి రోజు కంటే నాలుగో రోజు ఈ మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించడం విశేషం. అంతేకాదు చాలా సినిమాలు సాధారణంగా తొలి వారాంతరం తర్వాత వచ్చే సోమవారం బోల్తా పడతాయి. కానీ ఈ సినిమా మాత్రం సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అదా శర్మ నటించిన  ది కేరళ స్టోరీ తొలి రోజు రూ.8 కోట్లు వసూలు చేయగా, నాలుగో రోజు రూ.10 కోట్ల నెట్ రాబట్టడం మేకర్స్ ను ఆనందానికి గురి చేస్తోంది.
ఈ సినిమాను ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడులాంటి రాష్ట్రాలు నిషేధించాయి. మరికొన్ని చోట్ల కూడా థియేటర్ల నుంచి ఈ సినిమాను తీసేస్తున్నారు. అయితే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఇంకా భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ది కేరళ స్టోరీ నాలుగు రోజుల్లో రూ.45 కోట్లు వసూలు చేసింది. ఓ వర్గం నుంచి పాజిటివ్ రివ్యూలు, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు ఈ సినిమాకు మేలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

శనివారం రూ.10 కోట్లు, ఆదివారం రూ.16 కోట్లు వచ్చాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ది కేరళ స్టోరీ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఒకరకంగా గతేడాది ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై నెలకొన్న వివాదం ఆ సినిమాను ఎలా అయితే టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిపిందో, ఇప్పుడు ది కేరళ స్టోరీకి కూడా అలాగే జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం వెల్లడించారు. ‘‘ది కేరళ స్టోరీ సినిమాపై ఉత్తరప్రదేశ్‌లో పన్ను రహితం చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి యోగి హిందీలో ట్వీట్‌ చేశారు. యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి సినిమా ప్రత్యేక ప్రదర్శనను చూడాలని భావిస్తున్నారు.

సినిమా డైరెక్టరుకు బెదిరింపు

‘ది కేరళ స్టోరీ’ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, చిత్ర నిర్మాణ సిబ్బందిలో మరొకరికి గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. దేశంలో వివాదం రేపిన ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ తనకు బెదిరింపులు వచ్చాయని ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో ముంబయి పోలీసులు డైరెక్టర్ సుదీప్తోకు భద్రత కల్పించారు. ఇంటి నుంచి బయటకు రావద్దని బెదిరింపులో హెచ్చరించారు. పోలీసులు డైరెక్టర్ సుదీప్తోకు భద్రత కల్పించినా , దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదు.

మమతకు వివేక్‌ అగ్నిహోత్రి లీగల్‌ నోటీస్‌

ఇలా ఉండగా, బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి లీగల్‌ నోటీస్‌ పంపించారు. తన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్‌ నోటీస్‌ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా సమాజంలో ఒక వర్గాన్ని కించపర్చే విధంగా ఉన్నదని సోమవారం మమతా బెనర్జీ విమర్శించారు.
 
తాను తీసిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమబెంగాల్‌లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని మమతాబెనర్జి ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని ఆయన పేర్కొన్నారు.