పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టయ్యారు. అవినీతి కేసులో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌ కోర్టు ప్రాంగణం వద్ద భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అల్ కాదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇమ్రాన్‌ అరెస్టును పీటీఐ పార్టీ లాయర్లు అడ్డుకున్నారు. ఘర్షణలో లాయర్లకు గాయాలయ్యాయి. అయితే, ఇమ్రాన్‌ను ప్రభుత్వం వేధిస్తోందని లాయర్లు ఆరోపించారు.

అరెస్టు సమయంలో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు వెలుపల భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. అరెస్టు అనంతరం ఇమ్రాన్‌ను పాక్‌ సైన్యం రహస్య ప్రాంతానికి తరలించింది. మార్చి 7న ఇమ్రాన్‌ అరెస్టుకు ఇస్లామాబాద్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్‌పై 85 పైగా కేసులున్నాయి. ఇక ఇమ్రాన్‌ పాక్‌ ప్రధానిగా 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్‌ వరకు ప్రధానిగా కొనసాగారు. అయితే, తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్‌ గతంలో ఆరోపించారు.

అరెస్టు విషయాన్ని చెప్పకుండానే ఇమ్రాన్ ఖాన్‌ను చుట్టుముట్టారని ఆయన సహచరుడు ఫవాద్ చౌదరి తెలిపారు. పిటిఐకి చెందిన మరో నాయకుడు అజహర్ మష్వానీ 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను రేంజర్లు కోర్టులోపలే ఎత్తుకుపోయారని పేర్కొన్నారు. దేశంలో నిరసనకు పార్టీ వెంటనే పిలుపునిచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. ‘రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను చిత్రవధ చేస్తున్నారు…ఆయనని కొడుతున్నారు. వారు ఆయనపై ప్రతాపం చూపుతున్నారు’ అని వీడియో సందేశంలో చీమా ఆరోపించారు.
 
ఇమ్రాన్‌ అరెస్టును నిరసిస్తూ పాక్‌ అంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పీటీఐ పార్టీ పులుపునిచ్చిందంటూ ఆ పార్టీ నేత అజర్‌ మశ్వాని ట్వీట్‌ చేశారు. ఈ ఇస్లామాబాద్‌ కోర్టు ఆవరణలో ఇమ్రాన్‌ న్యాయవాది తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొంటూ చొక్కాపై రక్తపు మరకలతో ఉన్న వ్యక్తి వీడియోను పీటీఐ ట్వీట్‌ చేసింది. ప్రజాస్వామ్యానికి, పాక్‌కు ఇదో చీకటి రోజని అంటూ ట్వీట్‌ చేసింది.

ఇమ్రాన్ అరెస్ట్‌తో ఇస్లామాబాద్‌తో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఇమ్రాన్ మద్దతుదారులు కోర్టు బయట, దేశంలోని పలు పట్టణాల్లో విధ్వంసానికి దిగారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఎలాగైనా తనను కేసుల్లో ఇరికించాలని, హత్య చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని అరెస్ట్‌కు ముందు ఇమ్రాన్ వీడియో సందేశం సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన్ను అరెస్టు చేయలేదు. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతోపాటు కోర్టులో కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఇంతకాలం ఆయన్ను అరెస్టు చేయలేదు.