రెజ్లర్లు-పోలీసుల మధ్య ఘర్షణ

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లకు, ఢిల్లీ పోలీసులకు మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకున్నది. తోపులాటలో అధికారులు తమపై దాడి చేశారని, దూషించారని అథ్లెట్లు ఆరోపించారు.
 
జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్ల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వారికి వాటిని ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. అనప్పటికీ వారు ట్రక్కు నుంచి మంచాలు, పరుపులను బయటకు తీయడానికి ప్రయత్నించారు.
 
ఈ క్రమంలో రెజ్లర్లు, ఎమ్మెల్యే అనుచరులు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగట్ తోపాటు పలువురికి తలపై గాయాలయ్యాయి. ఇలాంటి రోజులు చూడటానికేనా.. తాము పతకాలు సాధించింది అంటూ వినేశ్‌ ఫొగట్‌ కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదని మండిపడ్డారు.
ఘటనా స్థలంలో మహిళా పోలీసులు ఎందుకులేరని నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశాడని ఫొగట్‌ ఆరోపించారు.  రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తాను గెలుచుకున్న నాలుగు పతకాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాని భజరంగ్‌ పునియా చెప్పారు. దేశానికి పతకాలు అందించిన రెజ్లర్లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు యావత్‌ దేశం మద్దతు అవసరముందని చెప్పారు.
 
ప్రతి ఒక్కరూ ఢిల్లీకి రావాలని కోరారు. పోలీసులు తమపై బలప్రయోగం చేస్తున్నారని వెల్లడించారు. మహిళలను దూషించారని ఆరోపించారు.
కాగా, ఈ ఘటనలో ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారతి అనుమతిలేకుండా మంచాలు తీసుకొచ్చారని, దూకుడుగా ప్రవర్తించారని చెప్పారు. ఘర్షణ అనంతరం జంతర్‌మంతర్‌ ప్రాంతాన్ని పోలీసులు సీల్‌ చేశారు.