కేంద్రీయ విశ్వవిద్యాలయాల నియామకాలకు యూనిఫైడ్ పోర్టల్‌

దేశవ్యాప్తంగా ఉన్నకేంద్రీయ విశ్వవిద్యాలయాలలో అధ్యాపక నియామకాలన్నింటినీ ఏకీకృతం చేస్తూ ఒక యూనిఫైడ్ పోర్టల్‌ను విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కమిషన్ (యూజీసీ) ప్రారంభించింది. సీయూ-ఛాయాన్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఈ పోర్టల్‌ను యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.
 
ఈ పోర్టల్ పూర్తిగా ఫ్రెండ్లీగా ఉంటుందని, నియామక ప్రక్రియలో అందరి అవసరాలను తీరుస్తుందని ఆయన చెప్పారు.  ఆయా యూనివర్సిటీల్లో ప్రస్తుతం జరుగుతున్న విధంగానే నియామక ప్రక్రియ కొనసాగుతుందని, అయితే ఈ పోర్టల్ అన్ని స్థాయుల్లో దరఖాస్తుదారులు, యూనివర్సిటీలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఖాళీలు, ఉద్యోగాల జాబితా కోసం ఈ పోర్టల్ ఒక వేదికను అందిస్తుంది. నియామక నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రక్రియ ఉంటుంది.

పోర్టల్ ప్రత్యేకతలు:

• ఒక దరఖాస్తుదారుడు ఒక లాగిన్‌తో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోడానికి వీలు కల్పిస్తుంది.

• అప్లికేషన్ రియల్ టైమ్ ట్రాకింగ్ కు వీలు కల్పిస్తుంది.

• ప్రతి దరఖాస్తుదారుడు తన అవసరాలకు తగ్గట్టు డ్యాష్‌బోర్డ్ తయారుచేసుకోవచ్చు.

• ప్రతి విశ్వవిద్యాలయం, డిపార్ట్‌మెంట్ కోసం అడ్మిన్ డాష్‌బోర్డ్ ఉంటుంది.

• బిల్ట్ ఇన్ ఈ-మెయిల్ కమ్యూనికేషన్

• దరఖాస్తుదారుల కోసం ఆన్‌లైన్ అభిప్రాయ సేకరణ, సూచనల స్వీకరణ

• రియల్ టైమ్ విశ్లేషణ, అప్లికేషన్ సమగ్ర సమాచారం

దరఖాస్తుదారుల కోసం ఈ పోర్టల్ అన్ని విశ్వవిద్యాలయాలలో ఉద్యోగ అవకాశాల ఏకీకృత జాబితాను చూపిస్తంది. తద్వారా ఏదైనా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేయడానికి ఒకే లాగిన్, అప్లికేషన్ ప్రాసెస్‌ చేసుకోవచ్చు. యూనివర్సిటీ పేరు, స్థానం, హోదా, వర్గం, విషయం, ఉపాధి రకం, అనుభవం, విద్యా స్థాయి మొదలైన వివిధ ఫిల్టర్‌లను ఉపయోగించి దరఖాస్తుదారులు ఉద్యోగాల కోసం శోధించవచ్చు.

దరఖాస్తుదారులు ఒక్క పోర్టల్ నుండి ఏదైనా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ అప్లికేషన్‌ను యాక్సెస్ చేయగలరు. అలాగే ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైనా ఖాళీలు ఏర్పడినప్పుడు వెంటనే ఈ-మెయిల్ అందుకుంటారని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.

ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లు మినహా ఇక నుంచి జారీ చేసే నియామక నోటిఫికేషన్లు అన్నింటినీ ఈ పోర్టల్ ద్వారానే జారీ చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  పోర్టల్ రూపొందించే క్రమంలో అన్ని సెంట్రల్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు సైతం పోర్టల్ అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు.