‘ది కేరళ స్టోరీ’కి ఏ సర్టిఫికెట్‌

దేశవ్యాప్తంగా రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ది కేరళ స్టోరీ’  చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్టు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో పాటు కొన్ని సన్నివేశాలను తొలగించాలని, మరికొన్ని డైలాగుల్లో మార్పులు చేయాలని సూచించింది.మొత్తం 10 సన్నివేశాలను తొలగించాలని సూచించింది.

ఇందులో ముఖ్యంగా రాజకీయంగా దుమారం రేపుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ సన్నివేశాలను కచ్చితంగా తొలగించాలని ఆదేశించింది. . దేవుళ్లకు సంబంధించిన డైలాగులు మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని  వాటిలో మార్పులు చేయాలని ఆదేశించింది. హిజాబ్‌, లవ్‌ జిహాద్‌ ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్‌  ‘ది కేరళ స్టోరీ’  చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. లవ్‌ జిహాద్‌ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే ఆరోపణలపై ఈ సినిమాను నిర్మించారు.  ఈ  చిత్రానికి సోషల్ మీడియా వేధికగా భారీ సంఖ్యలో మద్దతు వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క ఈ సినిమాపై స్టే కోసం ఒక వర్గం కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం స్టే ఇవ్వడానికి అంగీకరించలేదు. మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో భాగంగా.. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తో పాటు న్యాయవాది నిజామ్ పాషాలు సినిమాకు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు.  ఈ సినిమా ట్రైలర్ కు  16 మిలియన్ వ్యూస్ వచ్చాయని, కానీ ఇందులో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.  

దానికి బదులుగా  సుప్రీంకోర్  “విద్వేష ప్రసంగాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. బోర్డు క్లియర్ చేసింది. సినిమా విడుదలపై స్టే విధించాలని అడగడం సరికాదు. సరైన వేదికపై సర్టిఫికేషన్ ను సవాలు చేయండి” అని స్పష్టం చేసింది. దీంతో సినిమా విడుదలపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.

దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే దుష్ట పన్నాగంతోనే సంఘ్‌ పరివార్‌ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని కేరళలో అధికార పార్టీ సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.