తమిళ నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల బుధవారం కాలేయ సంబంధ వ్యాధితో మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోబాలను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.  హాస్య నటుడిగా తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులందరితో పనిచేసిన మనోబాల తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో 1953 డిసెంబర్‌ 3న మనోబాల జన్మించాడు. పదిహేడేళ్లకే సినీరంగలోకి ఎంట్రీ ఇచ్చి పలు విభాగాల్లో పనిచేశాడు.

కమల్‌ హాసన్‌ ప్రోత్సాహంతో 1979లో భారతీరాజా డైరెక్షన్‌లో ‘పుతియ వార్పుగల్‌’ సినిమాలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇప్పించాడు. అదే సినిమాలో ఓ చిన్న పాత్రలో కూడా మెరిసాడు. ఆ తర్వాత ఏడాది భారతి రాజా ‘నిరమ్‌ మారంత పూకల్‌’ సినిమాలో నటుడిగా మరో చాన్స్‌ ఇచ్చాడు. 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

1982లో ఆగాయ గంగై చిత్రంతో దర్శకుడిగా ఆయన మారారు. కార్తీక్, సుహాసిని ఈ చిత్రంలో నటించారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఊర్‌కావలన్(1987) చిత్రానికి ఆయనే దర్శకుడు. మోహన్ హీరోగా పిల్లై నిలా(1985), విజయకాంత్‌తో ఎనక్కు మట్టుంతాన్(1989) చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గజిని, అభీయుం నానుం, తుపాకీ చిత్రాలలో ఆయన పాత్రలు విశేష జనాదరణ పొందాయి. ఘోస్టీ, కొండ్రాల్ పావమ్ చిత్రాలు ఆయన నటుడిగా ఆయన చివరి చిత్రాలు. ఆయన భార్య, కుమారుడు ఉన్నారు.

కేవలం తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ చిత్రాలలోనూ మనోబాల దర్శకుడిగా సినిమాలు చేశాడు. సినిమాలే కాకుండా పలు సీరియల్స్‌ కూడా మనోబాల దర్శకత్వం వహించాడు. ఇక కమెడియన్‌గా మనోబాల ఎన్నో వందల సినిమాల్లో మెప్పించాడు. ముఖ్యంగా 2003 నుంచి ఇప్పటివరకు నటుడిగా తీరక లేకుండా గడిపాడు.

ఇప్పటివరకు మనోబాల నటుడుగా 450కి పైగా చిత్రాల్లో నటించాడు. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మనోబాల తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు. ‘పున్నమినాగు’, ‘గగనం’, ‘మనసును మాయ సేయకే’, ‘డేగ’, ‘ఊపిరి’, ‘రాజా ధి రాజా’, ‘మహానటి’, ‘దేవదాసు’, ‘రాజ్‌ధూత్‌’ వంటి సినిమాల్లో మెప్పించాడు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ మనోబాల కనిపించాడు. ఈ సినిమాలో మనోబాల జడ్జి పాత్ర పోషించాడు. మనోబాల మృతి పట్ల తమిళ చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, కార్తీ, జివి ప్రకాశ్ కుమార్, మంచు మనోజ్ తదితర ప్రముఖులు మనోబాల మృతికి సంతాపం ప్రకటించారు.