మహారాష్ట్ర రాజకీయాల్లో అతి త్వరలో భారీ మార్పు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత శరద్ పవార్ హఠాత్తుగా రాజీనామా చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏదో జరగబోతోందన్న అంచనాలకు తెరతీసింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రానుందని ప్రకటించారు.
 
“కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొని ఉంది. కొన్ని చర్చలు జరుగుతున్నాయి. దీని ప్రతిఫలమే ఇది. ఎన్‍సీపీ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడింది. శరద్ పవార్ తన శక్తిని కోల్పోతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రానుంది” అని ఘోష్ చెప్పారు.  ఎన్‍సీపీ కీలకనేత, శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ బీజేపీలోకి వెళుతున్నారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అయితే, తాను బీజేపీలోకి వెళ్లడం లేదని అజిత్ పవార్ చెప్పారు. ఎన్‍సీపీ అధ్యక్ష పదవికి మంగళవారం రోజున శరద్ పవార్ హఠాత్తుగా రాజీనామా చేశారు. ఎవరూ ఊహించని అడుగువేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు అనుకోని మలుపు తిరిగాయి. మంగళవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజీనామా ప్రకటన చేశారు.
 
 “చాలా సుదీర్ఘ కాలమైంది. వెనుక ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీని కొత్త తరం ముందుకు నడిపించాల్సిన సమయం వచ్చింది” అని శరద్ పవార్ చెప్పారు. “ఇంత సుదీర్ఘ కెరీర్ తర్వాత.. ఏదో ఒక దశలో ఆపేయాలని ఆలోచించాలి కదా” అని ఆయన పేర్కొన్నారు.  అయితే, తాను క్రియాశీల రాజకీయాల నుంచి మాత్రం తప్పుకోవడం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు.
“నేను అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా.. ప్రజాజీవితం నుంచి మాత్రం రిటైర్ అవడం లేదు. బహిరంగ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరవుతా” అని చెప్పారు. అయితే, ఎన్‍సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం గురించి పునరాలోచించేందుకు శరద్ పవార్ అంగీకరించారని గత రాత్రి అజిత్ పవార్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందనేలా సంకేతాలు ఇచ్చారు.