ఏప్రిల్‍లో రూ.1.87లక్షల కోట్ల జీఎస్‍టీ

వస్తు, సేవల పన్ను వసూళ్లలో ఏప్రిల్, 2023 లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది.  ప్రభుత్వం రూ.1.87లక్షల కోట్ల జీఎస్‍టీని వసూలు చేసింది. ఇప్పటి వరకు ఒక నెలలో అత్యధిక జీఎస్‍టీ వసూలు ఇదే. ఒక నెలలో జీఎస్‍టీ వసూళ్లు రూ.1.70లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారిగా ఉంది. ఈ డేటాను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది.
 
2022 ఏప్రిల్‍లో వసూలైన రూ.1.68లక్షల కోట్లే ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది. గత నెల జీఎస్‍టీ వసూళ్లూ దాన్ని అధిగమించి రూ.1,87,035 కోట్లకు చేరాయి.  ఏప్రిల్‍లో వసూలైన రూ.1.87లక్షల కోట్లలో సెంట్రల్ జీఎస్‍టీ రూ.38,440కోట్లు, స్టేట్ జీఎస్‍టీ రూ.47,412 కోట్లు, ఇంటిగ్రేడెట్ జీఎస్‍టీ  రూ.89,158కోట్లుగా ఉంది.

ఐజీఎస్‍టీ నుంచి సీజీఎస్‍టీకి రూ.45,864 కోట్లు, ఎస్‍జీఎస్‍టీకి రూ.37,959 కోట్లను ప్రభుత్వం సెటిల్ చేసింది. దీంతో సీజీఎస్‍టీ రూ.84,304కోట్లు, ఎస్‍జీఎస్‍టీ రూ.85,371 కోట్లకు చేరింది. గతేడాది ఇదే నెల (ఏప్రిల్ 2022)తో పోలిస్తే ప్రభుత్వానికి జీఎస్‍టీ నుంచి వచ్చిన ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్‍లో 12 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల (దిగుమతులు, సేవలు) నుంచి 16 శాతం ఆదాయం అధికమైంది.

ఒక రోజులో అత్యధిక జీఎస్‍టీ వసూలు రికార్డు ఏప్రిల్ 20వ తేదీన నమోదైంది. ఆ ఒక్కరోజే దేశవ్యాప్తంగా రూ.68,228 కోట్ల జీఎస్‍టీ వసూలైంది. రూ.9.8లక్షల కోట్ల విలువైన లావాదేవీలకుగానూ ఈ జీఎస్‍టీ వసూలు  అయింది. గతేడాది అదే రోజున వసూలైనదే గత రికార్డుగా ఉండేది. 2022 ఏప్రిల్ 20వ తేదీన రూ.57,846కోట్ల జీఎస్‍టీ వసూలైంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం ఎక్కువ జీఎస్‍టీ వసూళ్లు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2023-24 కేంద్ర బడ్జెట్‍లోనూ ఈ విషయాన్ని పొందుపరిచింది. అందుకు అనుగుణంగానే ఏప్రిల్‍లో జీఎస్‍టీ వసూళ్లు పెరిగాయి.

రికార్డ్‌ స్థాయిలో జీఎస్టీ వసూళ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో స్పందిస్తూ ఇది భారత ఆర్ధిక వ్యవస్థకు గ్రేట్‌ న్యూస్‌గా ఆయన అభివర్ణించారు. దేశంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ పన్నుల వసూళ్లు పెరగడం, జీఎస్టీ ఏకీకరణ, సమ్మతిని ఎలా పెంచిందో చూపిస్తుందని ప్రధాని  ట్విటర్‌లో పేర్కొన్నారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. గత సంవత్సరం ఏప్రిల్‌లో తెలంగాణలో రూ. 4,955 కోట్లు వసూలు అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో 13 శాతం పెరిగి రూ. 5,622 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం ఏప్రిల్‌లో రూ. 4067 కోట్లు వసూలయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో గత ఏడాదితో పోల్చితే 6 శాతం పెరిగి రూ. 4329 కోట్లు వసూలయ్యాయి.