ఐసిస్ చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీ హతం

ఐసిస్ చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీ హతమయ్యాడు. అతన్ని మ‌ట్టుబెట్టిన‌ట్లు ట‌ర్కీ అధ్యక్షుడు ట‌యిప్ ఎర్డోగ‌న్ ప్రకటించారు.  ట‌ర్కీ ఎంఐటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టిన ఆప‌రేష‌న్‌లో అబు హుస్సేన్ అల్ ఖురేషీ మృతి చెందిన‌ట్లు తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ ఏప్రిల్ 29వ తేదీ శ‌నివారం జ‌రిగిన‌ట్లు వెల్లడించారు.

60 నిమిషాల్లో జరిగిందని, మృతదేహాన్ని పరీక్షించిన తర్వాత అది ఐసిస్ చీఫ్‌దేనని నిర్ధారించినట్లు తెలిపారు. ఐసిస్ చీఫ్ అబు హ‌స‌న్ అల్ హ‌స్మినీ ఆల్ ఖురేషిని గ‌తేడాది న‌వంబ‌ర్ 30వ తేదీన ఆత్మాహుతి దాడిలో చనిపోయాడు. ఆ తర్వాత హ‌స్మినీ అల్ ఖురేషి స్థానంలో అబుల్ హుస్సేన్ అల్ ఖురేషీ ఐసీస్ చీఫ్గా  నియ‌మితుడయ్యాడు.

అతణ్ని మట్టుబెట్టేందుకు టర్కీ ఇంటెలిజెన్స్ బలగాలు రంగంలోకి దిగాయి. అతడు సిరియా ఉత్తర ప్రాంతంలో జిన్దారిలో తలదాచుకుంటున్నట్లు పసిగట్టాయి. ఈ సమయంలో అల్ ఖురేషీ ఉంటున్న జిన్దారి జోన్‌ను ట‌ర్కీష్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, లోక‌ల్ మిలట‌రీ అధికారులు దిగ్భందించారు. ఆ త‌ర్వాత ఖురేషీని అంత‌మొందించి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ సహా పలు దేశాల్లో ఐసిస్ దాడులకు పాల్పడుతూ వస్తోంది. పదుల సంఖ్యలో జనాలు ఐసిస్  దాడిలో చనిపోయారు. భారత్‌లోనూ ఈ ఇస్లామిక్ స్టేట్ జాడలు చాలా ఉన్నాయి. కేరళ, తమిళనాడుకు చెందిన చాలామంది ఐసిస్‌లో చేరినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఐసిస్ సానుభూతిపరులుగా ముద్రపడిన కొందరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.