అమెరికా యువతలో పెరుగుతున్న ఆత్మహత్యలు

అమెరికా యువతలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని  ఓ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా 13 నుండి 14 ఏళ్ల వయస్సు గల యువకులలో ఆత్మహత్యల రేటు తీవ్రంగా పెరుగుతోందని ఫ్లోరిడా అట్లాంటిక్‌ విశ్వవిద్యాలయం (ఎఫ్‌ఎయు) ష్మిత్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంది.

2008 నుండి 2018 మధ్య కాలంలో అమెరికా యువతలో ఆత్మహత్యలు రెండింతలు పెరిగాయని తెలిపింది. లింగం, జాతి బేధాలు లేకుండా ఆత్మహత్యలు రెండింటిలోనూ సమానంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ఆత్మహత్యలు పెరగడానికి సోషల్‌మీడియా వినియోగం, చదువుల ఒత్తిడి, తుపాకీ వినియోగాల మధ్య సహ సంబంధాన్ని సూచిస్తోందని అధ్యయనం పేర్కొంది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, తుపాకీలు సులభంగా దొరికే ప్రాంతాల్లో ఇవి మరింత అధికంగా ఉంటున్నాయని తెలిపింది. ఆత్మహత్యలు సెప్టెంబర్‌ , మే నెలల మధ్య, అలాగే సోమవారాల్లోనూ అధికంగానూ, మిగిలిన వారాల్లోనూ తక్కువగా ఉంటున్నాయని పేర్కొంది.

చదువుల ఒత్తిడి యువతలో ఆత్మహత్య ఆలోచనలను కలిగిస్తోందని అధ్యయనం వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆత్మహత్యల్లో 46.7 శాతం మంది తుపాకీలను వినియోగించగా, మెట్రోపాలిటన్‌ నగరాల్లో 34.7 శాతం మంది వినియోగిస్తున్నారని అధ్యయన వేత్తల్లో ఒకరైన ప్రొఫెసర్‌ చార్లెస్‌ హెచ్‌. హెన్నెకెన్స్‌ తెలిపారు.

13 నుండి 14 ఏళ్ల వయస్సు వారిలో ఆత్మహత్యల రేటు  పెరగడానికి ముందు వారు సోషల్‌మీడియాలోని పలు నెట్‌వర్క్‌లను ప్రారంభించినట్లు అధ్యయనంలో తేలిందని  హెన్నెకెన్స్‌ పేర్కొన్నారు. వీరు అధికంగా రెడ్డిట్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, మైస్పేస్‌ టంబ్లర్‌లను వినియోగిస్తున్నారని అన్నారు.