టీ20 క్రికెట్ చరిత్రలోనే కోహ్లి అరుదైన రికార్డు

ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ మరోసారి టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 8 మ్యాచ్ లలో అతడు ఐదు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. బుధవారం కూడా కేకేఆర్ తో మ్యాచ్ లో విరాట్ 54 పరుగులు చేసినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ ద్వారా టి20 క్రికెట్ చరిత్రలోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లి సాధించాడు.

201 పరుగుల చేజింగ్ లో విరాట్ 37 బంతుల్లోనే 54 పరుగులు చేసినా కీలకమైన సమయంలో ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్ ఆడిన చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లి టీ20ల్లో 3 వేలకుపైగా పరుగులు చేయడం విశేషం. 92 ఇన్నింగ్స్ లో కోహ్లి 3015 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్ లో ఒకే స్టేడియంలో 3 వేలకుపైగా పరుగులు చేసిన తొలి క్రీడాకారుడు కోహ్లియే.

విరాట్ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ క్రీడాకారుడు ముష్ఫికుర్ రహీమ్, మహ్మదుల్లా ఉన్నారు. రహీమ్ మీర్పూర్ లోని షేరె బంగ్లా స్టేడియంలో 121 ఇన్నింగ్స్ లో 2989 పరుగులు చేయగా, మహ్మదుల్లా ఇదే వేదికలో 130 ఇన్నింగ్స్ లో 2813 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్ నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో 90 ఇన్నింగ్స్ లో 2749 పరుగులు చేశాడు.

ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ తరఫునే ఆడుతున్న విరాట్ కోహ్లికి ఢిల్లీ తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సెకండ్ హోమ్ గా మారిపోయింది. ఈ స్టేడియంలో అతడు పరుగుల వరద పారించాడు. తాజాగా బుధవారం కేకేఆర్ తో మ్యాచ్ లోనూ మరో హాఫ్ సెంచరీ బాదాడు. అయితే మిగతా బ్యాటర్ల వైఫల్యంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.